హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టయిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు ఈ నెల 22 వరకు విజయవాడ ఏసీబీ కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఆదివారం ఉదయం ఏసీబీ కోర్టు ఎదుట చంద్రబాబును ప్రవేశపెట్టిన సీఐడీ 28 పేజీల రిమాండ్ రిపోర్టును సమర్పించింది. ఈ కేసులో 2021లో ఎఫ్ఐఆర్ నమోదు అయిందని, విచారణ నిమిత్తం చంద్రబాబును 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాదనలు కొనసాగాయి.
చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్
ఇరువర్గాల వాదనలు విన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి.. చివరకు సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో చంద్రబాబుకు 14 రోజు ల రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు పోలీసులు తరలిస్తున్నారు. చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించిన వెంటనే ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ముందు జాగ్రత్త చర్యగా సెక్షన్ 144 విధించారు. సోమవారం ఏపీ బంద్‌కు టీడీపీ పిలుపునిచ్చింది.