అమరావతి : ఆంధ్రుల అతి పెద్ద పండుగ సంక్రాంతికి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే పలు ప్రత్యేక రైళ్లను ( Special Trains ) సోమవారం నుంచి ప్రారంభించింది. విశాఖ(Visakha) -విజయవాడ (Vijayawada) మధ్య 12 జన్ సాధారణ్ రైళ్లను నడుపుతుంది.
జనవరి 12,13,14,16,18 తేదీలో విశాఖలో ఉదయం 10 గంటలకు ప్రారంభమై సాయంత్రం 4 గంటలకు విజయవాడకు చేరుకుంటుందని అధికారులు ప్రకటించారు. అదే విధంగా విజయవాడ నుంచి విశాఖకు సాయంత్రం 6.30 గంటలకు బయలు దేరి రాత్రి 12.35 గంటలకు చేరుకుంటుందన్నారు.
ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడేపల్లిగూడెం. ఏలూరు. గన్నవరం స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయని వెల్లడించారు.
కాగా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు 10 ప్రత్యేక రైళ్లను నడుపుతుంది . ఈ రైళ్లు ఈనెల 13,18,19 తేదీల్లో ఉదయం 6 గంటలకు సికింద్రాబాద్ నుంచి ప్రారంభం అవుతుందని నడుస్తాయని తెలిపారు. ఈనెల 17,19 తేదీల్లో మధ్యాహ్నం 2.40 గంటలకు విజయవాడ నుంచి హైదరాబాద్కు ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.
ఛైర్ కార్ బోగీల్లో ముందస్తు రిజర్వేషన్ చేసుకునే సదుపాయం ఉందని ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. రిజర్వేషన్ చేసుకోని వారి కోసం రైలులో సగానికి పైగా జనరల్ బోగీలు వాడుకోవచ్చన్నారు.