వైసీపీ ఎమ్మెల్యే, మాజీ సీఎం వైఎస్ జగన్ అసెంబ్లీకి రాకపోయినా చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఏపీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం సమావేశాలను బుధవారానికి వాయిదా వేశారు. ఆ తర్వాత నిర్వహించిన బీఏసీ సమావేశానికి హాజరైన స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ.. ఈ నెల 22వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతాయని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాలు సీరియస్‌గా జరుగుతున్నాయని స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఎమ్మెల్యేలు విధిగా అసెంబ్లీకి హాజరవ్వాలని సూచించారు. ఎవరి కోసమే అసెంబ్లీ సమావేశాలు ఆగవని స్పష్టం చేశారు. బడ్జెట్‌పై రేపు అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్యేలు అందరికీ శిక్షణ తరగతులు ఉంటాయని తెలిపారు. అలాగే విప్, చీఫ్ విప్‌లను కూడా రేపే ఖరారు చేస్తామని అన్నారు. శనివారం కూడా సభ నిర్వహించాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు. బిల్లులు, చర్చలకు అనుగుణంగా కొన్ని రోజులు రెండు పూటలా అసెంబ్లీ ఉంటుందని చెప్పారు. 8 బిల్లులతో పాటు ప్రభుత్వ పాలసీలకు ఆమోదం తెలపాలని నిర్ణయించుకున్నట్టలు పేర్కొన్నారు.