తాడేపల్లి: ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వైసీపీ ప్లీనరీకి ఏర్పాట్లు చేశామని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చెప్పారు. వైఎస్సార్ జయంతి రోజున శుక్రవారం ప్రారంభమై రెండు రోజుల పాటు కొనసాగుతాయిన్నారు. ఈ రెండు రోజుల్లో దాదాపు నాలుగు లక్షలకు పైగా ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ప్లీనరీలో పలు రాజకీయ, అభివృద్ధి తీర్మానాలకు ఆమోదం తెలుపనున్నట్లు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక అతిథులు అంటూ ఎవరినీ పిలువడం లేదని చెప్పారు. ప్లీనరీకి పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ హాజరవుతున్నట్లు తెలిపారు. మా ప్రభుత్వం చేసిన, చేస్తున్న మంచి పనులతోపాటు సంక్షేమ కార్యక్రమాలను ప్లీనరీలో వివరించి చెప్తామన్నారు.
చంద్రబాబు ఆరోపిస్తున్నట్లుగా డ్వాక్రా మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులను ఎవరినీ తమ ప్లీనరీకి రమమ్మని చెప్పలేదని స్పష్టం చేశారు. కేవలం వైసీపీకి చెందిన కార్యకర్తలు, నేతలే వస్తారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్లీనరీలో వివరిస్తామని చెప్పారు. ప్లీనరీ మొదటిరోజు 1.50 లక్షల మంది ప్రతినిధులు వస్తారని అంచనా వేసినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. రెండో రోజు దాదాపు 4 లక్షల మంది హాజరవుతారని అనుకుంటున్నామన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరును తొలి రోజు ప్రతిపాదిస్తామని, మరుసటి రోజున ఎన్నిక జరుగుతుందని వెల్లడించారు.
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఎనిమిదివేల స్కూళ్లు మూసివేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం లేదన్నారు. చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబువి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. దేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ ముందున్నదని విజయసాయిరెడ్డి చెప్పారు. చంద్రబాబుకు మాత్రం భిన్నంగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్లీనరీ జరిగిన తర్వాత చంద్రబాబు మళ్లీ బోరున విలపించక తప్పదని విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఒక్క హమీని కూడా చంద్రబాబు అమలు చేయకుండా తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన హయాంలోనే డిస్టిలరీకి అనుమతులు వచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.