Agriculture | ఆ యువకుడు ఓ వైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. మరోవైపు కూరగాయల సాగులో రాణిస్తున్నాడు. ఆన్లైన్లో విధులు నిర్వర్తిస్తూనే, ప్రత్యేకంగా సమయం కేటాయించుకొని తన తండ్రితో కలిసి అత్యాధునిక పద్ధతిలో పంటలు పండిస్తున్నాడు. ప్రతి రోజూ క్వింటాళ్ల కొద్ది వెజిటేబుల్స్‌ను మార్కెట్‌కు తరలిస్తూ లాభాలు పొందుతున్నాడు. ఆ యువరైతే ఇన్కర్గూడ గ్రామానికి చెందిన మహర్నర్ విజయ్‌పై ప్రత్యేక కథనం..
ఇంద్రవెల్లి, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా(బీ) గ్రామ పంచాయతీ పరిధిలోని ఇన్కర్గూడ గ్రామానికి చెందిన మహర్నర్ శంకర్ కుమారుడు విజయ్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. మరోవైపు వ్యవసాయం కూడా చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఉన్నత చదువులు చదివిన విజయ్ ప్రస్తుతం బెంగళూర్‌లోని ముబిలియం కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం కరోనా విజృంభించి లాక్డౌన్ విధించడంతో స్వగ్రామానికి తిరిగి వచ్చిన ఆయన ఓ వైపు ఆన్లైన్లో విధులు నిర్వహిస్తూనే.. తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు. తమకున్న ఆరెకరాలతోపాటు అదనంగా మరో మూడెక రాలు కౌలుకు తీసుకున్నారు. అత్యాధునిక పద్ధతిలో పండిస్తున్నాడు. పత్తితోపాటు స్టేకింగ్ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నాడు.
పందిరి సాగులో చిక్కుడు
విజయ్ తనకున్న ఆరెకరాల్లో అన్ని రకాల కూరగాయాలు పండిస్తున్నాడు. రెండెకరాల్లో స్టేకింగ్ పద్ధతిలో టమాట వేశాడు. ఇందుకు రూ.1.50 లక్షలు ఖర్చు చేయగా, రూ.3.40 లక్షల ఆదాయం వచ్చింది. 30 గుంటల్లో వంకాయ చేయగా, రూ.40 వేల పెట్టుబడి అయ్యింది. ఇప్పటి వరకు రూ. 80 వేల ఆదాయం వచ్చింది. మూడు గుంటల్లో బీర సాగు చేయగా, రూ.10 వేలు పెట్టుబడి పెట్టాడు. రూ.40 వేల లాభం వచ్చింది. మూడు గుంటల్లో సోర సాగుకు రూ.10 వేలు ఖర్చు చేస్తే.. రూ.35 వేలు ఆదాయం పొందాడు. రెండు గుంటల్లో చిక్కుడు వేయగా రూ.20 వేలు పెట్టుబడి పెట్టాడు. రూ.50 వేల ఆదాయం వచ్చింది. అలాగే రెండు గుంటల్లో రూ.50 వేల పెట్టుబడితో మిర్చి, కాకర, దోస, బబ్బెర, అల్చంత, ఎరుపు బెండ, కొత్తిమిర, మెంతి, ఉల్లిగడ్డ, ఎల్లిపాయలు పండిస్తున్నాడు. ఇప్పటివరకు వీటి ద్వారా రూ.2 లక్షలు లాభపడ్డాడు. మరో మూడెకరాలను కౌలుకు తీసుకున్నాడు. రెండెకరాల్లో గోబీ సాగు చేస్తున్నాడు. రూ.లక్ష పెట్టుబడి పెట్టగా రూ. 2.30 లక్షలు ఆదాయం పొందాడు. మరో రెండెకరాల్లో పత్తి సాగు చేసేందుకు రూ.90 వేల పెట్టుబడి పెట్టగా, ఇప్పటి వరకు 20 క్వింటాళ్ల పత్తి తీశాడు. ఇది విక్రయిస్తే దాదాపు రూ.1.72 లక్షల ఆదాయం వస్తుందని తెలిపాడు.
కూరగాయలపై చీడ పురుగులు రాకుండా ఏర్పాటు చేసిన పరికరం
కూరగాయలకు చీడ పురుగులు సోకకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. సమయాన్ని బట్టి మందులు స్ప్రే చేస్తున్నాడు. పురుగులు పట్టకుండా పంటల మధ్యలో కెమికల్‌తో కూడిన బాక్సులను ఏర్పాటు చేశాడు. పంటల కోసం వచ్చిన చీడ పురుగులు ఆ బాక్స్‌లో పడిపోతాయి.
వర్షపు నీరు వృథాకాకుండా తమ భూమిలో ఇంకుడు గుంత ఏర్పాటు చేశాడు. వర్షపు నీరు నేరుగా ఇంకుడు గుంతలోకి చేరేలా ఏర్పాటు చేశాడు. ఇంకుడు గుంతలో నిండే మట్టిని యేటా తొలగించి భూమిలో పోస్తున్నాడు. దీంతో భూమి సారవంతంగా మారి మంచి దిగుబడులు వస్తున్నాయి.
స్లేకింగ్ తీగ పద్ధతిలో సాగు చేసిన సొర
స్టేకింగ్కు ఆనుకొని డ్రిప్ ఏర్పాటు చేసి పంటలకు నీరు అందిస్తున్నాడు. ఒక్కసారి మోటర్ స్టార్ట్ చేస్తే అన్నింటికీ నీరు అందుతుంది. ఈ విధానంతో సాగు నీరు వృథాకాదు.
బెంగళూరులోని ముబిలియం కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. రెండేళ్ల క్రితం కరోనా వైరస్ విజృంభించడంతో లాక్డౌన్ విధించారు. దీంతో ఇంటికి రావాల్సి వచ్చింది. ఆ సమయంలో కూరగాయలు పండించాలని నిర్ణయించుకున్న. మా నాన్న శంకర్‌తో కలిసి తొమ్మిదెకరాల్లో రకరకాల కూరగాయలు పండిస్తున్న. మొదటి సంవత్సరం కూరగాయల సాగు కోసం రూ.3.50 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షల వరకు పెట్టుబడి అవుతున్నది. యేడాదంతా కూరగాయలు పండిస్తూనే ఉంటాం. మార్కెట్‌కు తరలించి విక్రయిస్తున్నాం. మంచి లాభముంటుంది. ఆన్లైన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే.. కూరగాయలు పండిస్తున్న.
– మహర్నర్ విజయ్, రైతు, ఇన్కర్గూడ