Dragon Fruit | సంప్రదాయ సాగుతో విసిగిపోయిన రైతులు.. తక్కువ శ్రమతో దీర్ఘకాలం పాటు ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టే పంటల వైపు మొగ్గుచూపుతున్నారు. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న డ్రాగన్ ఫూట్ సాగును ఎంచుకొని మంచి ఆదాయం పొందుతున్నారు. ఎకరానికి లక్ష వరకూ మిగులుతుండడంతో ఒకరి తర్వాత ఒకరు పంట సాగు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. మానుకోట జిల్లాలో తొలుత ప్రయోగాత్మకంగా మొదలైన డ్రాగన్ ఫ్రూట్ సాగు ఇప్పుడు క్రమంగా 15 ఎకరాలకు చేరడం విశేషం. ఎకరానికి రూ.5లక్షల పెట్టుబడితో 20 ఏళ్ల పాటు దిగుబడినిచ్చే పంట కోసం ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుండడంతో పాటు అంతర పంటగా కర్బూజ, పుచ్చకాయ, కూరగాయలు వేసి అదనపు ఆదాయమూ పొందే వీలుండడంతో రైతులు హుషారుగా పంట వేస్తున్నారు.
Dragon Fruit1
మహబూబాబాద్, నమస్తే తెలంగాణ : డ్రాగన్ ఫ్రూట్‌తో రైతులు అధిక ఆదాయం పొందుతున్నారు. ఎకరాకు లక్ష రూపాయల ఆదాయం వస్తుండడంతో మహబూబాబాద్ జిల్లాలో సాగు చేసేందుకు ఎక్కువ మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్‌ను ఎత్తుగా ఉండే నేలల్లో పంట వేయాలి. ఒక మొక్క రూ.60లకు లభిస్తుంది. జడ్జర్ల, రంగారెడ్డి జిల్లాలో ఉండే నర్సరీలలో మొక్కలు దొరుకుతాయి. ముందుగా భూమిని చదును చేసుకున్న తర్వాత సిమెంట్ స్తంభాలు నాటాలి. ఒక స్తంభానికి, మరో వరుస స్తంభానికి మధ్య ఎనిమిది ఫీట్ల దూరం ఉండాలి. ఎత్తు ఏడు ఫీట్ల వరకు ఉండాలి. ప్రతి స్తంభం పైభాగంలో సిమెంట్ బిల్లలు అమర్చాలి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటిన రెండు సంవత్సరాలకు పంట చేతికి వస్తుంది. ఒకసారి పంట ప్రారంభమైన తర్వాత 20 సంవత్సరాల వరకు దిగుబడి వస్తూనే ఉంటుంది. ఎకరానికి సుమారు రూ.5లక్షల పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 30 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తుంది. కిలో డ్రాగన్ ఫ్రూట్స్‌కు రూ.250లు చొప్పున విక్రయిస్తున్నారు. ఒక క్వింటాల్‌కు రూ.25వేలు వస్తుంది. మొత్తం 30 క్వింటాళ్లకు రూ.7.50లక్షల ఆదాయం వస్తుంది. అన్ని ఖర్చులు పోను ఎకరానికి ఏటా లక్ష వరకు ఆదాయం వస్తుంది. ఇందులో అంతర పంటగా పుచ్చ, కర్బూజతో పాటు కూరగాయలు సాగు కూడా చేసుకోవచ్చు. తద్వారా రైతుకు అదనపు ఆదాయం వస్తుంది. డ్రాగన్ ఫ్రూట్స్‌తో లాభాలు వస్తుండడంతో రైతులు ఈ పంట వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. డ్రాగన్ ఫ్రూట్ మొక్కకు ముళ్లు ఉండడం వల్ల కోతుల బెడద కూడా ఉండదు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 15 ఎకరాల్లో ఐదుగురు రైతులు సాగు చేస్తున్నారు. ఇందులో ఇప్పటికే మరిపెడలో ఒక రైతు, గూడూరు మండలంలో మరో రైతు ప్రయోగాత్మకంగా డ్రాగన్ ఫ్రూట్ పంట వేశారు. ఒక ఎకరాకు రూ.లక్ష ఆదాయం వస్తుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Dragon Fruit2
నేను రెండు సంవత్సరాల క్రితం ఎకరమున్నర భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పంట వేశాను. నాకు పది క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. కిలోకు రూ.200 చొప్పున పది క్వింటాళ్లకు రూ.2లక్షలు వచ్చాయి. ఇందులో పెట్టుబడి రూ.50వేలు పోను మిగతా రూ.1.50 లక్షల ఆదాయం వచ్చింది. నాకు ఉద్యానశాఖ నుంచి మొత్తం రూ.90వేల సబ్సిడీ వచ్చింది. డ్రాగన్ ఫ్రూట్స్ పంట చేతికి రాగానే ఖమ్మం, వరంగల్ మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్మేస్తాను. ఈ ఏడాది కూడా ఇంకా అదనంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. మే నుంచి జూన్‌లో పంట మళ్లీ కోతకు వస్తుంది.
– లూనావత్ రమేశ్, రైతు, మరిపెడ
నాకు మూడెకరాల భూమి ఉంది. ఇందులో ఒక ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్ వేశాను. ఇప్పటికే రెండు మార్లు పంటను అమ్మాను. ఒక ఎకరాకు 30 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. పెట్టుబడి, కూలీల ఖర్చు అన్నీపోను లక్ష మిగులుతాయ్. అంతర పంటగా పుచ్చకాయ తోట పెట్టాను. ఈ పంటతో మరో రూ.50వేల వరకు వచ్చే అవకాశం ఉంది. ప్రయోగాత్మకంగా ఒక ఎకరంలో పంట వేశాను. మరో ఎకరంలో త్వరలోనే డ్రాగన్ ఫ్రూట్ పంట వేస్తా. కిలో ఫ్రూట్స్ రూ.250లకు చొప్పున అమ్మాను. ఆశించిన స్థాయిలో ఆదాయం వచ్చింది.మున్ముందు మరింత ఆదాయం వస్తుందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు.
– ముత్తయ్య, రైతు, గూడూరు