ఒకప్పుడు వరి పండించిన ఊర్లే అవి.. ఎంత కష్టపడ్డా పైసలు ఆడికాడికి అయిపోయేవి. వచ్చిన డబ్బంతా పెట్టుబడి కింద అటే పోయేది. సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవటంతో ఆ ఊరి వ్యవసాయ పరిస్థితే మారిపోయింది. రైతుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. ఫలితంగా ఏడాదంతా సంపాదన ఉంటున్నది. కూరగాయలు, వాణిజ్య పంటలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. ఇదీ ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల విజయగాథ!
గజ్వేల్, డిసెంబర్ 12: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేటలో అంతకుముందు ఏడాదిలో వరి, మక్కజొన్న పంటలను పండించేవారు. సీఎం కేసీఆర్ ఆ గ్రామాలను దత్తత తీసుకొన్న తర్వాత రైతులపై దృష్టిపెట్టారు. వారికి లాభం అంటే ఏంటో చూపించాలనుకొన్నారు. ఆ దిశగా ఇతర పంటల సాగును పెంచేలా ప్రోత్సహించారు. నూతన సాగు పద్ధతులను రైతులకు పరిచేయాలని అక్కడి వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. డ్రిప్ ఇరిగేషన్‌ను రైతులందరికీ మంజూరు చేసి, వాణిజ్య పంటలు, వివిధ రకాల కూరగాయలను సాగు చేయాలని సూచించారు. ఫలితంగా ఇప్పుడు రైతులు ఇతర పంటలతో అధిక దిగుబడులు సాధిస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. ఈ మధ్యే పల్లి సాగును ప్రారంభించారు. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలతో పాటు మర్కూక్ మండలంలోని మర్కూక్, గణేశ్‌పల్లి, పాతూర్, పాములపర్తిలో మొత్తం 16 మంది రైతులు 45 ఎకరాల్లో పల్లిని సాగుచేశారు. కొన్ని గ్రామాల్లో పల్లి కోతకు కూడా వచ్చింది. అధికారులు లేపాక్షి రకం విత్తనాలు అందించి అధిక దిగుబడి సాధించేలా చేశారు. ఇటీవలే విత్తనోత్పత్తి సంస్థ రీజినల్ మేనేజర్ కూడా ఇక్కడి రైతుల పంటను పరిశీలించి, కొనటానికి చర్చలు జరిపారు.
400 ఎకరాల్లో కూరగాయల సాగు
ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులు రెండేండ్లుగా కూరగాయల సాగుతో లాభాలు ఆర్జిస్తున్నారు. రెండు గ్రామాల్లో మొత్తం సాగు విస్తీర్ణం 1800 ఎకరాలు కాగా, అందులో 400 ఎకరాల్లో కూరగాయల పంటలే సాగువుతున్నాయి. మిగతా భూముల్లో ప్రాధాన్య క్రమంలో పత్తి, మక్కజొన్న పండిస్తూ కుటుంబ అవసరాలకు వరి సాగుచేస్తున్నారు. పత్తి, మక్కజొన్న పంటల్లో అంతర పంటగా కంది సాగుచేస్తున్నారు. కంది, పెసర, పత్తి, మక్కజొన్న, పల్లి, శెనగ వాణిజ్య పంటలతో పాటు చిక్కుడు, బీర్నిస్, వంకాయ, కాకరకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, మిర్చి తదితర పంటలను సాగుచేస్తున్నారు. రెండు గ్రామాలకు కొండపోచమ్మ సాగర్ కాల్వలు, కూడవెళ్లి వాగు నీరు పుష్కలంగా లభిస్తున్నది.
రెండేండ్లుగా కూరగాయలే
మాకు ఏడెకరాల భూమి ఉన్నది. వానకాలంలో 5 ఎకరాల్లో పత్తి వేశాను. ఎకరంలో చిక్కు డు, బెండకాయ కూరగాయలు పండిస్తున్నా. రెండెకరాల్లో తినడానికి ఎకరం వరి, మరో ఎకరంలో మక్కజొన్న పండించాను. ఇప్పుడు మళ్లీ కూరగాయ పంటలే వేస్తున్నా. రెండేండ్లుగా కూరగాయ పంటలే ఎక్కువగా పండిస్తున్నాం. టమాట, బెండ, చిక్కుడు కూరగాయలు ఎక్కువగా వేస్తున్నాం.
మా భూములు బంగారమయ్యాయి
సీఎం కేసీఆర్ ఆలోచనతో సాగు పద్ధతులు పూర్తిగా మారిపోయాయి. మా ఊరి భూములు బంగారమయ్యాయి. కూరగాయల సాగుతో రెండేండ్లుగా ఏడాదంతా డబ్బులు సంపాదిస్తున్నాం. చాలామంది సంప్రదాయ మొక్కజొన్నకు బదులు స్వీట్‌కార్న్ పండించి లాభాలను పొందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ క్వింటాలుకు రూ.12వేల ధర పలుకుతున్నది.