నాణ్యమైన మామిడి ఉత్పత్తికి ఐదు జిల్లాలు గుర్తింపు
హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రం నుంచి మామిడి పండ్లను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కీలక ముందడుగు పడింది. ఇటీవల ఉద్యానశాఖ, కేంద్ర ప్రభుత్వం మధ్య కీలక సమావేశం జరిగింది. రాష్ట్రంలో వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలు నాణ్యమైన మామిడి ఉత్పత్తికి అనుకూలమని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం ఈ జిల్లాల్లో 58 వేల ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. 2.29 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. కేంద్రం మరో 10 వేల ఎకరాల్లో కొత్తగా పంటను ప్రోత్సహించనున్నది. 67 వేల ఎకరాల ఎగుమతిస్థాయి కలిగిన నాణ్యమైన మామిడిని ఇకడ ఉత్పత్తి చేయనున్నది.
ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు
ఎగుమతికి మామిడి పండ్లు నాణ్యతను కలిగి ఉండాలి. ఉత్పత్తి, ప్రాసెసింగ్‌లో ఎలాంటి రసాయనాలు ఉపయోగించకూడదు. ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేయాలి. ఇందుకు ఐదు జిల్లాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు, కంపెనీలు నెలకొల్పేందుకు కేంద్రం సహకరించనున్నది. ఇందుకు మొత్తం రూ.200 కోట్లు అవసరం అవుతాయి. ఇందులో రూ.100 కోట్లు కేంద్రం మంజూరు చేయనున్నది. మిగిలిన మొత్తంలో కొంత కంపెనీలు, మరికొంత రాష్ట్రం భరించాల్సి ఉంటుంది.
తెలంగాణ మామిడికి భారీ డిమాండ్
తెలంగాణ మామిడికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉన్నది. కానీ, ఎగుమతికి అవసరమైన సౌకర్యాలు లేవు. దీంతో కేంద్రంతో కలిసి విదేశాలకు ఎగుమతి చేసేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఐదు జిల్లాలను క్లస్టర్లుగా గుర్తించాం. ఎగుమతి ప్రారంభమైతే మామిడి రైతులకు ఎంతో లాభం ఉంటుంది.
– ఎల్ వెంకట్రామ్రెడ్డి, డైరెక్టర్ ఉద్యానశాఖ