పొద్దుతిరుగుడు పువ్వుతోపాటే రైతన్న దశ కూడా తిరుగుతున్నది. నూనె గింజల్లో ముఖ్యమైన ఈ పంట.. కర్షకుల ఇంట కాసులు కురిపిస్తున్నది. ప్రస్తుతకాలంలో ఈ నూనె వినియోగం ఎక్కువ అవుతుండగా, మార్కెట్లో ‘పొద్దుతిరుగుడు’కు డిమాండ్ పెరుగుతున్నది. దీంతోపాటు తకువ పెట్టుబడి, తకువ కాలపరిమితి వల్ల ఈ నూనె గింజల సాగుకు రైతాంగం కూడా ఆసక్తి చూపుతున్నది. పొద్దు తిరుగుడు పంట కాలం అతి తక్కువ. కేవలం మూడు నెలల్లోనే పంట చేతికి వస్తుంది. అందుకోసమే, వ్యవసాయశాఖ అధికారులు కూడా పంట మార్పిడిలో భాగంగా పొద్దుతిరుగుడు సాగు చేయాలని సూచిస్తున్నారు. కొద్దిపాటి యాజమాన్య పద్ధతులు పాటిస్తే, మంచి లాభాలు ఆర్జించవచ్చని చెబుతున్నారు.
అనువైన నేలలు
నీరు నిల్వ ఉండని ఎర్ర చెలకలు, ఇసుక, నల్ల రేగడి, ఒండ్రు నేలలు పొద్దు తిరుగుడు సాగుకు అనుకూలం. వర్షాధారంగా పండించాలి అనుకొంటే బరువైన నల్లరేగడి నేలలు, నీటి వసతి ఉంటే తేలిక నేలల్లో సాగు చేసుకోవచ్చు.
దుక్కి తయారీ
పొద్దుతిరుగుడు అన్ని కాలాలకూ అనువైన పంట. అయితే, దుక్కి సిద్ధం చేసుకునే విధానంలో మాత్రం కొన్ని వ్యత్యాసాలు ఉంటాయి. బోదెలు చేసి విత్తనాలు విత్తుకున్నట్లయితే, పంటకాలంలో వివిధ దశల్లో నీటి తడులు ఇవ్వడానికి, పైపాటుగా ఎరువులు వేయడానికే కాకుండా మొకలకు తగినంత పటుత్వం కూడా లభిస్తుంది. పొద్దుతిరుగుడు సాగుకోసం దుక్కిని రెండుమూడు సార్లు దున్నుకోవాలి. ఎకరానికి మూడు నుంచి నాలుగు టన్నుల పశువుల ఎరువును వేసి, కలియదున్నాలి.
విత్తుకునే విధానం
యాసంగిలో జనవరి మొదటి పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకూ నీటి పారుదల కింద ఈ పంటను సాగు చేసుకోవచ్చు. పుష్పించే దశతోపాటు గింజ గట్టిపడే దశలో ఎకువ పగటి కాలం (8-10 గంటలు), సూర్యరశ్మి ఉంటే దిగుబడి పెరుగుతుంది. ఒక ఎకరానికి రెండు నుంచి రెండున్నర కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. కిలో విత్తనానికి 5 మి.లీ. ఇమిడాక్లోప్రిడా ఎఫ్ఎస్ లేదా 3 గ్రాముల తైరా కలుపుకొని, విత్తనశుద్ధి చేసుకోవాలి. దీనివల్ల నేల నుంచి వచ్చే తెగుళ్లను, విత్తన నాశక కీటకాలను నివారించవచ్చు. సాళ్ల మధ్య దూరం 60 సెం.మీ. (2 అడుగులు), మొక్కల మధ్య దూరం 30 సెం.మీ. (అడుగు) ఉండేలా విత్తుకోవాలి. తేలిక నేలల్లో 45 సెం.మీ. X 20 సెం.మీ. నుంచి 25 సెం.మీ. నల్లరేగడి నేలల్లో 60 సెం.మీ. X 30 సెం.మీ. దూరం ఉండేలా చూసుకోవాలి. విత్తనాలు మొలకెత్తిన 10-15 రోజుల తరువాత కుదురుకు ఆరోగ్యకరమైన ఒక మొకను ఉంచి, మిగిలినవాటిని తీసివేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మొకల మధ్య నీరు, పోషకాల కోసం పోటీ తగ్గి పువ్వు పరిమాణం పెరుగుతుంది. అధిక దిగుబడికి దోహదపడుతుంది.
నీటి యాజమాన్యం..
విత్తనాలు వేసేముందు భూమిలో తేమ ఉండేలా చూసుకోవాలి. వానకాలంతో పోలిస్తే వేసవిలో నీటి వినియోగం ఎక్కువ. 7-10 రోజులకు ఒక్కసారి నీటి తడులను అందించాలి. నేలల రకాన్ని బట్టి, పగటి ఉష్ణోగ్రతను బట్టి ఎర్ర నేలల్లో 8-10 రోజుల వ్యవధిలో, నల్లరేగడి నేలల్లో 15-20 రోజుల వ్యవధిలో నీటి తడులు పెట్టాలి. పుష్పించే దశ నుంచి గింజ బలపడేవరకూ నేలలో తేమ తగ్గకుండా నీటిని పారించాలి.
కలుపు నివారణ..
విత్తనం వేసిన రెండు రోజుల్లోపే లీటర్ నీటిలో 5 మి.లీ. పెండిమిథలిన్ కలిపి, వ్యతిరేక దిశలో పిచికారీ చేసుకోవాలి. విత్తనం మొలకెత్తిన తర్వాత గుంటుక నాగలి/ కలుపు నాగలితో దున్నుకోవాలి. మొక్కల మధ్య మిగిలిన కలుపు మొక్కలను సంప్రదాయ పద్ధతిలో మనుషుల సాయంతో తొలగించాలి. మొగ్గ తొడిగే వరకూ కలుపు లేకుండా చూసుకోవాలి.
ఎరువులు/పోషకాలు..
సరైన సమయానికి పోషక ఎరువులను అందించడం ద్వారా దిగుబడిని భారీగా పెంచుకోవచ్చు. ఇందుకోసం నత్రజనిలో 25 శాతం పొటాష్ కలుపుకొని, 30 రోజుల పంటగా ఉన్నప్పుడు, మొగ్గ తొడిగే సమయాల్లో వేసుకోవాలి.
భూసార పరీక్షల ఆధారంగా వ్యవసాయ అధికారులు సిఫారసు చేసిన మోతాదులో పోషకాలు అందించాలి. వర్షాధారంగా సాగు చేస్తే 24 కిలోల నత్రజని, 36 కిలోల భాస్వరం, 12 కిలోల పొటాషియం ఎరువులు వేయాలి. గంధకం తకువగా ఉన్న నేలల్లో ఎకరానికి 55 కిలోల జిప్సం వేస్తే నూనె శాతం పెరుగుతుంది. పైరు పూత దశలో (ఆకర్షక పత్రాలు వికసించే దశలో) లీటర్ నీటిలో 2 గ్రా. బోరాక్స్ కలిపి పిచికారీ చేయాలి.
అంతర పంటలు
పొద్దుతిరుగుడులో అంతర పంటలతోనూ ఆదాయం పొందవచ్చు. 4:2 నిష్పత్తిలో వేరుశనగతో కలిపి పొద్దుతిరుగుడును సాగు చేయవచ్చు. కందితో కలిపి 1:2 నిష్పత్తిలో వేసుకోవచ్చు. పంట మార్పిడి పాటిస్తూ జొన్న, సజ్జలాంటి చిరుధాన్యాలు, కంది, మినుములాంటి పప్పు ధాన్యాలతో పొద్దుతిరుగుడు పంటను సాగు చేసుకొంటే, అదనపు ఆదాయం సమకూర్చుకోవచ్చు.
జాగ్రత్తలు తీసుకోవాల్సిందే!
పొద్దుతిరుగుడు పంటలో పరాగసంపర్కం జరిగేందుకు తేనెటీగలు ఎంతగానో సహకరిస్తాయి. అందువల్ల పుష్పించే సమయంలో హానికరమైన రసాయన మందులను పిచికారీ చేయవద్దు. ఉదయం 7గం. నుంచి 10 గం. సమయాల్లో సున్నితమైన వస్త్రంతో పువ్వులను రుద్దాలి. వారం రోజులకు ఒకసారి ఇలా చేయడం వల్ల ఫలదీకరణం సక్రమంగా జరుగుతుంది. ఫలితంగా గింజ నాణ్యత పెరుగుతుంది.
పక్షుల బెడద..
పొద్దుతిరుగుడులో పక్షుల వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ నష్టాన్ని అరికట్టేందుకు 2 లీటర్ల నీటిలో ఒక పచ్చి కోడిగుడ్డు నీలం (పచ్చ సొన)ను కలుపుకొని వారం రోజులకు ఒకసారి పువ్వు మీదే పిచికారీ చేసుకోవాలి. పంట చుట్టూ మెరుపు తీగలను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే దగ్గర ఎక్కువ విస్తీర్ణంలో పంటను సాగు చేయాలి. శబ్దాలు చేయడం, దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం ద్వారా కూడా పక్షుల బెడదను తగ్గించవచ్చు. చేను చుట్టూ గుంజలు పాతి ఇనుప తీగను చుట్టడం ద్వారా అడవి పందుల బారి నుంచి పంటను కాపాడుకోవచ్చు. పువ్వు వెనుకభాగం నిమ్మ పచ్చరంగులోకి మారిన తరువాత, పువ్వులను కోయాలి. సరైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే, ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి పొందవచ్చు.