Spinach Cultivation | ఆకుకూర పంటల్లో పాలకూర చాల ముఖ్యమైనది. ఎన్నో పోషకాలను కలిగి ఉన్న ఈ కూరను సాగు చేయడం చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. ఇదే సమయంలో సరైన యాజమాన్య పద్ధతులను పాటించడం ద్వారా లాభాలను ఒడిసిపట్టుకోవచ్చు. ఈ స్వల్ప కాలిక పంటను ప్రతి కూరగాయలలో చేర్చి వండుకోవచ్చు. పాలకూరను హోటళ్లు, దాబాల్లో విరివిగా ఉపయోగిస్తారు. పాలకూరలో విటమిన్ ఏ, సీ తో పాటు మాంసకృత్తులు, పైబర్, ఐరన్, కాల్షియం వంటివి ఉండి మనకు శక్తినిస్తాయి. పాలకూర వాతావరణంలోని హెచ్చు తగ్గులను తట్టుకుని నిలబడుతుంది. ఒక్కసారి నాటుకున్న పంటను 4-7 కోతల వరకు వస్తుంది.
విత్తన రకాలు
పాలకురలో జాబ్నర్ గ్రీన్, బెనర్జీ, పూసహారిత్, పూసజ్యోతి; పూసపాలక్, ఆర్కఅనుపమ, అల్ గ్రీన్ రకాలను ఎంచుకొని మంచి దిగుబడి సాధించవచ్చు.
జాబ్నర్ గ్రీన్ : వీటి ఆకులు మొత్తం ఒకే రకంగా ఉండి లేత రంగుతో మందంగా ఉండి ఘాటైన వాసన వెదజల్లుతూ ఉంటుంది. 4-7 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 15-18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
బెనర్జీ : పెద్దపెద్ద ఆకులు కలిగిఉండి మృధువైన కాండాన్ని కలిగి ఉంటుంది. 4-7 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 15-18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
పూసహారిత్ : ఇది చలిని తట్టుకుంటుంది. అన్ని రకాల భూముల్లో సాగు చేసుకోవచ్చు. 4-6 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 15-18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
పూసజ్యోతి : ఆకులు వెడల్పుగా ఉంటాయి. ఆకుల కాండం లేతగా మృధువుగా ఉంటాయి. 6-8 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 18-20 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
పూసపాలక్ : ఈ రకం విత్తనం అన్ని ఒకే రకమైన ఆకులను గుబురుగా కలిగి ఉంటాయి. 4-7 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 15-18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
ఆర్కఅనుపమ : అన్నిరకాల వాతావరణంలో సంవత్సరం పొడువునా సాగుచేయవచ్చు. మంచి దిగుబడిని ఇస్తుంది. లేటుగా పూతకు వస్తుంది. అన్ని ఒకే రకమైన ఆకులను గుబురుగా కలిగిఉంటాయి. 4-7 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 15-18 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
అల్ గ్రీన్ : ఈ రకం విత్తనం అన్ని ఒకే రకమైన లేత ఆకులను గుబురుగా కలిగిఉంటాయి. 4-6 కోతల వరకు వస్తుంది. ఎకరానికి 6-8 టన్నుల వరకు దిగుబడి వస్తుంది.
విత్తనం నాటుకోవడం
ఎకరానికి 5 టన్నుల పశువుల ఎరువు తోలుకోని బాగా కలియ దున్నాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 15 కిలోల DAP, 20 కిలోల పోటాష్, 10 కిలోల నత్రజని వేసుకోవాలి. ఎకరంలో పాలకూర సాగుకు 13 కిలోల విత్తనం సరిపోతుంది. 2 మీటర్ల వెడల్పుతో 10 మీటర్ల పొడువుగా మడులను తయారుచేసుకోవాలి. మడుల మధ్యలో సాలుకు సాలుకు 20 సెంటి మీటర్లు ఉండేలా.. గింజకు గింజకు 7 సెంటి మీటర్లు ఉండేలా.. 3 సెంటి మీటర్ల లోతులో విత్తుకోవాలి. గింజలు లోతులో విత్తినట్లయితే మొలకలు సరిగా రావు. గింజలు నాటిన 10 రోజుల్లో మొలకెత్తుతాయి.
నీటి యాజమాన్యం
గింజలు విత్తిన వెంటనే నీరు పెట్టాలి. మూడో రోజు తిరిగి తడి ఇవ్వాల్సి ఉంటుంది. గింజలు మొలకెత్తిన తర్వాత భూమిలో తేమను బట్టి నీరు పెడుతూ ఉండాలి. కోతలు కోసిన ప్రతిసారి నత్రజని ఎరువును చల్లి నీటి తడి ఇచ్చినట్లయితే మంచి దిగుబడి వస్తుంది.
కోతలు
ఆకులు బాగా పెరిగినది గమనించి కాండం మొదలు భాగం వరకు కోసుకోవాలి. సాధారణంగా మొదటి కొత 3 వారాలకు వస్తుంది. ఎప్పటికప్పుడు కలుపు మొక్కలు లేకుండా చూసుకొని సరైన యాజమాన్యం పాటిస్తే ప్రతి కోతకు ఎకరానికి 3 టన్నులు తగ్గకుండా దిగుబడి వస్తుంది.