చేపల పెంపకం చేపట్టే రైతులు సరైన చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి. వాటిని చెరువులలో సక్రమ విధానాలలో వదులాలి. అప్పుడే మంచి దిగుబడులు సాధించి ఆర్థికంగా నిలదొక్కుకుంటారని నిపుణులు సూచిస్తున్నారు.
-భారతీయ మేజర్ కార్ప్, విదేశీ కార్ప్ చేపపిల్లలు పెంపకానికి అనువైనవి.
-చెరువులలో లభించే సహజ ఆహారాన్ని కాకుండా అనుబంధ ఆహారాన్ని ఇష్ట పూర్తిగా తీసుకునేవిగా ఉండాలి.
-భిన్నమైన ఆహారపు అలవాట్లతో, ప్రవర్తనతో ఉండే జాతులను ఎంపిక చేసుకోవాలి.
-తాత్కాలిక ప్రతికూల పరిస్థితులను తట్టుకునేవిగా ఉండాలి.
-మంచి రుచికర, పోషక విలువలు గల మాంసం కలిగినవై ఉండాలి.
-సహజసిద్ధంగానే కాకుండా కృత్రిమ విధానంలోనూ పిల్లలను ఉత్పత్తి చేయగల చేపల రకాల చేపపిల్లలను ఎంపిక చేసుకోవాలి.
నాణ్యత గల చేపపిల్లల ఎంపిక
-చేపపిల్లలు చురుకుగా ఈదుతుండాలి.
-చేపపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండి మెరుస్తూ ఉండాలి.
-చేపపిల్లల శరీరంపై ఎలాంటి మచ్చలు, కురుపులు, గాయాలు లేకుండా ఉండాలి.
-చేపపిల్లల శరీరంపై ఎలాంటి పరాన్నజీవులు లేకుండా చూసుకోవాలి.
-చేపపిల్లలు ఈక, తోకలు చీలికలు లేకుండా సంపూర్ణ, సరైన స్థితిలో ఉండాలి.
-చేప పిల్ల తలభాగం మిగతా శరీర భాగానికి సమతూకంగా ఉండాలి.
చేపపిల్లల రవాణాలో జాగ్రత్తలు
-చేపపిల్లల రవాణా చేయడానికి ముందు 24 గంటల పాటు ఎటువంటి ఆహారాన్ని ఇవ్వకూడదు.
-రవాణా చేయదలచిన చేపపిల్లలకు చేతిరాపిడి తగులకుండా సున్నితపు వలలో పట్టి ఉంచుకోవాలి.
-రవాణా చేయు వాహనంలో ఆక్సిజన్ సిలిండర్లను అమర్చి ఆక్సిజన్‌ను అందిస్తూ రవాణా చేసుకోవాలి.
-చేపపిల్లలను తక్కువ ఉష్ణోగ్రత గత నీటిలో రవాణా చేయాలి.
-చేపపిల్లలను రవాణా చేసే వ్యాన్, లారీలను ఎండలో నిలుపరాదు.
-పాలిథీన్ బ్యాగ్‌లో సరైన మోతాదులో ఆక్సిజన్ ఉన్నదా, లేదా చేపపిల్లలు చురుకుగా ఉన్నాయా లేవా అనేది గమనించాలి.
-పంపిణీ చేయబడిన చేపపిల్లలను ఎక్కడ ఆగకుండా నిర్దేశింపబడిన నీటి వనరు వద్దకు తీసుకపోవాలి.
-నిర్దేశించిన నీటి వనరులలో మాత్రమే చేపపిల్లలను వేసుకోవాలి.
-నీటి వనరులలో వేసుకునే ముందు పాలిథీన్ బ్యాగులను నీటిలోకి వదిలి అట్టి నీరు ఉష్ణోగ్రతను అలవాటు చేసి తదుపరి బ్యాగు తెరిచి లోనికి నీటి వనరులోని నీటిని కొద్దికొద్దిగా కలిపి అప్పుడు వదులాలి.