e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, April 16, 2021
Advertisement
Home టాప్ స్టోరీస్ హైడ్రోతో అద్భుతాలు.. సాఫ్ట్‌వేర్‌ దంపతుల వినూత్న వ్యవసాయం

హైడ్రోతో అద్భుతాలు.. సాఫ్ట్‌వేర్‌ దంపతుల వినూత్న వ్యవసాయం

హైడ్రోతో అద్భుతాలు.. సాఫ్ట్‌వేర్‌ దంపతుల వినూత్న వ్యవసాయం
  • అత్యాధునిక పద్ధతులకు శ్రీకారం

ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా వ్యవసాయ రంగం కొత్తపుంతలు తొక్కుతున్నది. తరిగిపోతున్న సహజ వనరులను సద్వినియోగం చేసుకునేలా అత్యాధునిక పద్ధతులను అందిపుచ్చుకుంటున్నది. వీటిలో ‘నీటి సాగు’ (హైడ్రోపోనిక్స్‌).. భవిష్యత్‌ అవసరాలను తీర్చేదిగా కనిపిస్తున్నది. భాగ్యనగరానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్‌ జంట.. ఈ పద్ధతిలో సేద్యానికి శ్రీకారం చుట్టింది. మట్టి అవసరం లేకుండానే అద్భుతమైన దిగుబడులను సాధిస్తున్నది.

వ్యవసాయ రంగంలో వచ్చిన మరో విప్లవం.. హైడ్రోపోనిక్‌ సాగు (నీటి సాగు). ఈ పద్ధతిలో మట్టితో పనిలేదు. వానలు కురవలేదన్న బాధాలేదు. కలుపు మొక్కల దిగులు లేదు. చీడపీడల చింత లేనేలేదు. ఎకరాలకొద్దీ పొలం కూడా అవసరం లేదు. సాగుకు పనికిరాని ఏ నేలైనా పర్లేదు. ఏడాది పొడవునా పచ్చని పైరును పెంచవచ్చు. అధిక దిగుబడిని సాధించవచ్చు. అత్యధిక లాభాలు పొందవచ్చు. అవును, ఇది నగరాల్లో సూటూబూటూ వేసుకొన్న రైతులు చేస్తున్న సాగు.

‘హైడ్రోపోనిక్స్‌’ విధానంలో అద్భుతమైన పంటలు పండిస్తున్నారు హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ దంపతులు సచిన్‌ దర్బార్వర్‌, శ్వేత దర్బార్వర్‌. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని అర్జునపట్ల గ్రామంలో ‘సింప్లీ ఫ్రెష్‌’ పేరుతో ఈ ఆధునిక సేద్యానికి శ్రీకారం చుట్టారు. వీరిద్దరూ ఉద్యోగరీత్యా కొన్నేండ్లపాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో నివాసమున్నారు. అక్కడ తాజా కూరగాయలు కొనుక్కోవడానికి నేరుగా పొలాలకే వెళ్లేవారు. విదేశాల్లోని ఆధునిక వ్యవసాయ విధానాలు, నాణ్యమైన కూరగాయలను చూశాక, తామూ సేద్యం చేయాలనుకున్నారు. కొన్నాళ్లపాటు అక్కడి సాగు విధానాలపై అధ్యయనం చేసి, పకడ్బందీ ప్రణాళికతో స్వదేశానికి తిరిగొచ్చారు. మొదట్లో శామీర్‌పేట దగ్గర పదెకరాల్లో పలు రకాల ఆకుకూరల్ని ప్రయోగాత్మకంగా సాగు చేశారు. అది విజయవంతం కావడంతో అర్జునపట్ల గ్రామంలో 150 ఎకరాల్లో ‘సింప్లీ ఫ్రెష్‌ ప్రాజెక్ట్‌’ను ప్రారంభించారు. ఇందులో 22 ఎకరాల్లో గ్రీన్‌ హౌస్‌లు ఏర్పాటు చేసి లెట్యూస్‌, వైన్‌ క్రాప్స్‌, మెడిసినల్‌ ప్లాంట్స్‌ను సాగు చేస్తున్నారు. దిగుబడులను హైదరాబాద్‌తోపాటు ముంబై, చెన్నై, వైజాగ్‌లాంటి మెట్రోల్లో మార్కెట్‌ చేస్తున్నారు.

సాగు విధానం

వ్యవసాయరంగంలో ‘హైడ్రోపోనిక్‌’ విధానం అత్యాధునికమైంది. ఇందులో సాగుకోసం గ్రీన్‌ హౌజ్‌లను నిర్మించి, వివిధ సైజుల్లో పైపులు, డ్రమ్ములు, ట్రేలను ఏర్పాటు చేస్తారు. ట్రేలలో కొబ్బరి పీచుతో తయారు చేసిన ‘కోకోపిట్‌’ను పరిచి, అందులో యంత్రాల సాయంతో విత్తనాలను నాటుతారు. వాటిని నీళ్లతో తడుపుతారు. మొలకలు వచ్చిన తర్వాత డ్రిప్‌ పద్ధతిలో నేరుగా వేళ్లకే సాగునీరు అందిస్తారు. ఇందుకోసం నాలుగు డ్రిప్‌ పైపులను ఏర్పాటు చేస్తారు. వీటి ద్వారా, సాగునీటిలోనే మొక్కలకు పోషకాలను అందిస్తారు. మొక్కల ఎదుగుదలకు అవసరమైన నత్రజని, క్యాల్షియం, జింక్‌, ఐరన్‌ వంటివన్నీ అందులో ఉంటాయి. మొక్కలు నిటారుగా నిల్చోవడానికి, నీటిని పీల్చుకోవడానికి ఆధారంగా ‘క్లేబాల్స్‌ (ఆధారాలు)’ను ఏర్పాటు చేస్తారు. మొక్క పీల్చుకోగా మిగిలిన నీరు పైపులద్వారా మళ్లీ ప్రధాన నీటి సరఫరా వ్యవస్థలోకే వెళ్తుంది. దీనివల్ల నీటిని మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. వృథా ఉండదు. సాధారణ సాగులో 100 లీటర్లు అవసరమైన చోట, హైడ్రోపోనిక్స్‌లో కేవలం 5 లీటర్లు మాత్రమే అవసరమవుతుంది. దాదాపు 95 శాతం నీరు ఆదా అవుతుంది. ఇలా 60 నుంచి 90 రోజుల్లోనే పంట చేతికి వస్తుంది. భవిష్యత్తు అంతా ఈ తరహా వ్యవసాయ విధానానిదే అంటున్నారు నిపుణులు.

నిల్వ నీటితోనే..

ప్రపంచంలోనే అత్యధిక నాణ్యత కలిగిన విత్తనాలను ‘సింప్లీ ఫ్రెష్‌’ సంస్థ అభివృద్ధి చేస్తున్నది. గూగుల్‌ ఆడిట్‌ద్వారా ఎంపిక చేసిన విత్తనాలను ఇక్కడ పండిస్తున్నాం. ఆధునిక సాంకేతికతతో మొక్కలను పెంచుతున్నాం. వర్షపు నీటి సంరక్షణ పద్ధతులతో నిల్వ ఉంచిన నీటినే మొక్కల పెంపకానికి మళ్లీ మళ్లీ వినియోగిస్తున్నాం.

  • సచిన్‌ దర్బార్వర్‌, ‘సింప్లీ ఫ్రెష్‌’ ఫౌండర్‌, సీఈఓ

మట్టి లేకుండానే..

హైడ్రోపోనిక్‌ పద్ధతిలో మట్టి వినియోగం ఉండదు. కొబ్బరి పీచుతో తయారు చేసిన ‘కోకోపిట్‌’ను ట్రేలలో పరిచి, అందులో విత్తనాలు వేస్తారు. అయితే, పెద్ద మొత్తంలో సాగు చేసినప్పుడు కూలీల అవసరం కూడా అంతే ఉంటుంది. కానీ, ‘సింప్లీ ఫ్రెష్‌’లో యంత్రాలతోనే సాగు చేస్తున్నాం. తద్వారా 90 శాతం విత్తనాలు మొలకెత్తే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మొక్కలు సమానంగా పెరిగి, దిగుబడులు ఒకేసారి చేతికి వస్తాయి.

  • శ్వేత దర్బార్వర్‌, సీఎంఓ

… మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి

Advertisement
హైడ్రోతో అద్భుతాలు.. సాఫ్ట్‌వేర్‌ దంపతుల వినూత్న వ్యవసాయం

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement