పందిళ్లపై తీగజాతి కూరగాయల సాగు రైతుకు లాభాల పంట పండిస్తున్నది. అయితే, పందిరి నిర్మాణానికి ప్రారంభపు పెట్టుబడి ఎకువగా అనిపిస్తుంది. కానీ, పంటకాలం ఎకువగా ఉండటం, నాణ్యమైన దిగుబడి వస్తుండటంతో ఈ విధానంలో మంచి ఫలితాలు వస్తున్నాయి. దీనికితోడు ధర కలిసివచ్చిన సందర్భాల్లో కూరగాయలు సాగుచేసిన రైతులు లాభాల బాటలో సాగుతున్నారు. ఈ మార్గంలోనే పయనిస్తూ.. శాశ్వత పందిళ్లపై దొండ సాగుచేసి, మంచి లాభాలను ఆర్జిస్తున్నారు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గ రైతులు.
ఏటా సాగుచేస్తున్న వాణిజ్య పంటల కోసం లక్షలకు లక్షలు వెచ్చించి, నష్టాలను చవిచూస్తున్న రైతులు అధిక ఆదాయాన్ని ఇచ్చే ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు ఆసక్తి చూపితే సరైన ఫలితాలను సాధించవచ్చు. దీనికి ఉదాహరణగా నిలుస్తున్నారు నల్లగొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గానికి చెందిన రైతులు. ఈ నియోజకవర్గంలో దాదాపు 3,000 ఎకరాల్లో కూరగాయలు సాగవుతున్నాయి. ప్రత్యేకించి ప్రతి రైతూ శాశ్వత పందిళ్లపై దొండ సాగు చేస్తుండటం విశేషం. సాధారణంగా తీగజాతి కూరగాయలను నేలమీద సాగుచేస్తే గాలి, వెలుతురు సరిగ్గా సోకవు. దాంతో చీడపీడల బెడద ఎకువగా ఉంటుంది.
దిగుబడి కూడా అంతంతమాత్రమే. ఇక వర్షాలు ఎక్కువగా కురిసిన సందర్భాల్లో అయితే పంటపై ఆశలు వదులుకోవాల్సిందే. కానీ పందిరి విధానంలో ఆ సమస్యలు ఉండవు. మొకలు ఆరోగ్యంగా పెరగడమే కాదు, దిగుబడి కూడా గణనీయంగా ఉంటుంది. నేలమీద కంటే పందిళ్లపై 50 నుంచి 60 శాతం అధిక దిగుబడి రావడం ఇక్కడి రైతులు గమనించారు. అలా పొలంలో సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేసుకొని, జేవైర్ను పందిరిలా అల్లి, కొన్నేండ్లుగా దొండ సాగు చేస్తున్నారు. పందిరి నిర్మాణం కోసం ఎకరాకు 6 క్వింటాళ్ల తీగ అవసరం అవుతుంది. ప్రారంభ దశలో పెట్టుబడి ఎకువే అయినా.. మొదటి ఏడాదే పెట్టుబడి పోను నికర లాభాలను ఆర్జించే అవకాశం ఉంటుందని రైతులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
దొండ సాగు చిన్న, సన్నకారు రైతుల పాలిట వరంలా మారింది. కూలీలతో పెద్దగా పని ఉండదు. రైతు దంపతులు, కుటుంబసభ్యులకు రోజూ పని లభించడంతోపాటు నికర ఆదాయాన్ని పొందవచ్చు. పందిరి సాగుకు మొదట ఖర్చు ఎకువే అయినా శాశ్వత పందిరి ద్వారా మంచి దిగుబడితోపాటు ఆదాయం పొందవచ్చు. ఏడాదికి ఎకరాకు 60 టన్నుల దిగుబడిని తీస్తున్నారు రైతులు. మారెట్లో సరాసరి కిలో రూ.7కు అమ్మినా, ఎకరా పంటకు సుమారు రూ.4.20 లక్షల ఆదాయం వస్తుంది. ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.3 లక్షలు పోయినా, రూ.1,20,000 నికర ఆదాయం పొందుతున్నారు. ఇక రెండు, మూడో ఏడాది నుంచి పెద్దగా పెట్టుబడులు ఉండవు కాబట్టి, వచ్చేదంతా నికరంగా లాభమే. అందువల్ల, కూరగాయలు పండించే రైతులు కొంత విస్తీర్ణంలోనైనా శాశ్వత పందిరి వేసుకొని దొండ సాగుచేయాలని సూచిస్తున్నారు.
పందిరి సాగుతో నష్టం లేదు
దొండ ఒకసారి నాటితే మూడేండ్లపాటు దిగుబడి వస్తుంది. స్తంభాల మధ్య 5 మొకలు నాటుకోవాలి. ఒకో అంటుమొక్కకు రూ.2 ఖర్చవుతుంది. కిలో దొండకాయల ధర కనీసం రూ.15- రూ.20 దాకా ఉంటుంది. కాబట్టి, పందిరి సాగులో నష్టం ఉండదు. వారానికి ఒకసారి దొండకాయలను కోయవచ్చు. డ్రిప్ ద్వారా సాగునీరు, ఎరువులు ఇవ్వవచ్చు. దొండ సాగు మొదటి ఏడాది ఎకరాకు పెట్టుబడి రూ.2.50 నుంచి 3 లక్షల వరకు అవుతుంది. ఒక కోతలో ఎకరాకు 30-70 బస్తాల దిగుబడి వస్తుంది. ఈ విధంగా చూస్తే ఏడాదికి ఎకరాకు 60 టన్నుల దిగుబడి వస్తుంది. అన్ని ఖర్చులూ పోను ఎకరాకు నికరంగా లక్ష నుంచి రెండు లక్షల వరకు ఆదాయం ఉంటుంది.
యాజమాన్య పద్ధతులు
దొండ సాగు కోసం ఎకరాకు 10- 20 ట్రకుల పశువుల ఎరువు వేసి దున్నుకోవాలి. ఎకరా స్థలంలో పందిరి వేయడానికి 400 స్తంభాలు అవసరం. స్తంభాల మధ్య దూరం 12 అడుగులు ఉండేలా చూసుకోవాలి. ఎకరా ప్రదేశంలో దొండ సాగు చేయడానికి 1,200 – 2,000 అంట్లు అవసరమవుతాయి. దొండలో రెండు రకాలు ఉన్నాయి. అవి లావు దొండ, పెన్సిల్ దొండ. దొండ సాగులో చీడపీడల నివారణ, పురుగులకు, ప్రోక్లయిన్ తెగుళ్లకు సాప్ సోర్ వినియోగిస్తారు.
…?మజ్జిగపు శ్రీనివాస్‌రెడ్డి