ఆదిలాబాద్ జిల్లాలో మద్యం బెల్ట్‌షాపుల దందా జోరుగా సాగుతున్నది. పల్లె పల్లెనా విచ్చల విడిగా వెలుస్తుండడంతో ముఖ్యంగా యువత మద్యం మత్తుకు బానిసవుతూ భవిష్యత్‌ను నాశనం చేసుకుంటున్నది. కొన్ని గ్రామాల్లో బెల్ట్‌షాపులను స్థానికులు, మహిళలు వ్యతిరేకించినా ఫలితం లేకుండా పోతున్నది. ధనార్జనే ధ్యేయంగా అధిక ధరలకు మద్యాన్ని విక్రయిస్తూ బెల్ట్‌షాపుల నిర్వాహకులు పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. బెల్ట్‌షాపులు గ్రామాల్లో ప్రశాంతతను దెబ్బతీస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులు తొలగించేలా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామీణులు, మహిళలు కోరుతున్నారు.
ఆదిలాబాద్, జూన్ 13 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లోని పలు గ్రామాల్లో కొందరు కిరాణా, చిన్న దుకాణాలు పెట్టుకుని నిబంధనలకు విరుద్ధంగా, అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారు. చిరు వ్యాపారాలు, కూలీ చేసుకుని కుటుంబాలను పోషించుకోవాల్సిన వారిపై బెల్ట్‌షాపుల ప్రభావం చాలా కనబడుతున్నది. తాగుడుకు బానిసైన వారు పనులు మానివేసి ఉదయం నుంచి రాత్రి వరకు బెల్ట్‌షాపుల్లో మద్యం సేవిస్తూ ఉండడంతో వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కొన్ని గ్రామాల్లో ఊరి మధ్యలోనే బెల్ట్‌షాపులు ఉండడంతో ఆ దారిలో పోవాలంటే మహిళలు, స్థానికులు భయపడాల్సి వస్తుంది.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాలతో పాటు గ్రామ శివారు ప్రాంతాల్లో బెల్ట్‌షాపులు ఉన్నాయి. పల్లెల్లో సైతం ఈ దుకాణాలు విచ్చలవిడిగా వెలిశాయి. జిల్లాలో 300 వరకు బెల్ట్ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తున్నది. గ్రామాల్లో దళారులు వేలం పాట ద్వారా ఈ దుకాణాలను దక్కించుకుంటున్నారు. వేలం పాట డబ్బులను రాబట్టుకోవడంతో పాటు, అక్రమ సంపాదన కోసం మద్యాన్ని ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. జిల్లాకు పక్కనే మహారాష్ట్ర ఉండడంతో అక్కడి నుంచి సైతం మందుబాటిళ్లను తీసుకువచ్చి అక్రమంగా విక్రయిస్తున్నారు. బెల్ట్‌షాపుల్లో మద్యం అధిక ధరలను వసూలు చేస్తున్నారు. ప్రతి బాటిల్‌పై రూ.30 నుంచి 40వరకు అదనంగా తీసుకుంటున్నారు. అధిక ధరల ఫలితంగా మద్యం కొనుగోలుదారులు నష్టపోవాల్సి వస్తుంది. అధికారులు తెలిసే ఈ వ్యవహారం జరుగుతుందని స్థానికుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్‌షాపులను తొలగించాలని కోరుతున్నారు.