ఎదులాపురం, డిసెంబర్ 18 : క్లెయిమ్ చేసుకోని ఆర్థికపరమైన ఆస్తులను ప్రజలు తిరిగి పొందేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘మీ డబ్బు-మీ హకు’ కార్యక్రమం నెల 24న ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రత్యేక శిబిరం నిర్వహించనున్నట్లు ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిబిరం కొనసాగనున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా, సంవత్సరాల తరబడి క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెంట్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు తదితర ఆస్తులను వాస్తవ యజమానులు సులువుగా పొందేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
ప్రజల సొమ్ము యాజమానులకు వెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ కార్యక్రమం నిదర్శనమని పేరొన్నారు. ఆర్బీఐ, ఐఆర్డీఐఏ, పీఎఫ్ఆర్ డీఏ వంటి జాతీయస్థాయి సంస్థలు, బ్యాంకులు, బీమా కంపెనీలు ఉమ్మడిగా శిబిరాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఆస్తుల స్వాధీనంపై ప్రజలకు మార్గనిర్దేశం చేయడంతోపాటు, అవసరమైన పత్రాల పరిశీలన, ధ్రువీకరణ చేసుకోవచ్చని వివరించారు.
ముఖ్యంగా బ్యాంకుల్లో పదేండ్లకు పైగా క్లెయిమ్ చేసుకోని డిపాజిట్లు ఉన్న పౌరులు, ఆర్బీఐ ఉద్గం వెబ్ సైట్ ద్వారా సులభంగా వివరాలు సేకరించి, చర్యలు తీసుకోవచ్చని సూచించారు. వెబ్ సైట్ https://udgam.rbi.org.inలో ఆర్థిక ఆస్తుల వారసత్వం, చిరునామ మార్పులు, వయోధికులు, నిర్జీవమైన బ్యాంకు ఖాతాలు వంటి కారణాల వల్ల అనేక ఆస్తులు క్లెయిమ్ చేయకుండా ఉండిపోయాయన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వాటిని తిరిగి యాజమానులకు చేరవేయడం ప్రధాన లక్ష్యమని చెప్పారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, తమ ఆస్తులు తనిఖీ చేసుకుని, తగిన పత్రాలతో శిబిరంలో పాల్గొనాలని కోరారు.