నార్నూర్ : ఆదిలాబాద్ జిల్లా నార్నూర్( Narnoor ) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో (KGBV school) బుధవారం అన్నంలో పురుగులు ( Worms ) రావడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న ఆదివాసి, లంబాడా సంఘాల నాయకులు పాఠశాలను సందర్శించారు. పాఠశాల విద్యార్థులతో మాట్లాడారు. మేను ప్రకారం భోజనం పెట్టడం లేదని, కనీస సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆరోపించారు.
విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ ( Sub Collector Yuvaraj Marmat ) పాఠశాలను సందర్శించారు. తరగతి గదులు, వంటశాలలో వంటకాలు, గిడ్డంగిలో నిల్వ ఉన్న సరుకులను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని, పాఠశాలలో శుభ్రతతో పాటు మేను ప్రకారం భోజనం వడ్డించాలని ఆదేశించారు.
వారం రోజులపాటు పాఠశాలను తనిఖీ చేయాలని జీసీడీవో ఉదయ్ శ్రీ, ఎంఈవో పవర్ అనితకు సూచించారు. పాఠశాలలో నెలకొన్న పరిస్థితులపై జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా దృష్టికి తీసుకెళ్తామన్నారు. క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆయన వెంట తహసీల్దార్ జాడి రాజాలింగం, ప్రత్యేక అధికారి హీమ బిందు, ఆదివాసి, లంబాడ సంఘాల నాయకులు ఉన్నారు.