కుభీర్ : గ్రామాలలో మౌలిక వసతుల కల్పనకు పనుల జాతర కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఎంపీడీవో సాగర్ రెడ్డి ( MPDO Sagar Reddy ) పేర్కొన్నారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుభీర్ ( Kubheer ) మండలం రంజని తాండ గిరిజన గ్రామంలో ఈజీఎస్ నిధులు రూ. 9.69 లక్షలతో చేపట్టిన వ్యవసాయ క్షేత్రాలకు రోడ్డు, రూ.5.60 లక్షలతో చేపట్టిన సేద్యపు బావులను ఈజీఎస్ ఏపీవో రాథోడ్ హరిలాల్, ఎంపీఓ మోహన్ సింగ్, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఎంపీడీవో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి హామీ నిధుల ద్వారా ఇందిరా మహిళా శక్తి ఉపాధి భరోసా కింద పశువుల పాకలు, గొర్రెల షెడ్లు, కాంపోస్టు గుంతలు, సేద్యపు బావులు, వ్యవసాయ క్షేత్రాలకు వెళ్లే పొలం బాటలు, కోళ్ల ఫారాలు, నర్సరీల పెంపకం, జలనిధి కింద చెక్ డ్యాములు, ఊట కుంటల నిర్మాణాలు చేపట్టవచ్చని అన్నారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్, ఆర్డబ్ల్యూ ఎస్ శాఖల ఆధ్వర్యంలో గ్రామీణ రహదారులు తాగునీటి సరఫరా పనులు చేపట్టవచ్చని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో టాయిలెట్స్ నిర్మాణం , తదితర గ్రామాభివృద్ధికి అవసరమయ్యే పనులు ఈ పనుల జాతరలో చేపట్టేందుకు కృషి చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ చైర్మన్ సిద్ధంవార్ వివేకానంద, స్థానిక నాయకులు రాథోడ్ గులాబ్ నాయక్, సాహెబ్రావ్, టి ఏ సాగర, ఎఫ్ ఏ దిలీప్ మహిళలు, ఉపాధి కూలీలు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.