కౌటాల, మే 14 : మండలంలోని సూర్య చంద్ర మండల సమాఖ్యకు కేటాయించిన భవనం మాకే కావాలని, ఇందులో గ్రంథాలయం ఏర్పాటు చేయవద్దని, మాకు తెలియకుండా భవనం గేటు తాళాలు పగుల గొట్టిన ఎమ్మెల్యే హరీశ్‌బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహిళా సంఘాల సభ్యులు బుధవారం కౌటలలోని ఐకేపీ కార్యాలయం ఎదుట రాస్తారోకో చేశారు. మండల కేంద్రంలోని పాత ఐకేపీ కార్యాలయానికి సంబంధించిన భవనంలో ప్రస్తుతం ఏరియా కో ఆర్డినేటర్‌కు సెంటర్‌గా కొనసాగుతున్నది. ఇందులో మండల గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు మంగళవారం భవనాన్ని పరిశీలించేందుకు రాగా గేటుకు తాళం ఉన్నది.
2 గంటలకు పైగా మహిళా సంఘాల సభ్యుల వస్తారని వేచి చూసినా రాకపోవడంతో గేటు తాళాన్ని పగులగొట్టించి ఎమ్మెల్యే లోపలికి వెళ్లారు. బుధవారం ఉదయం గ్రంథాలయం ఏర్పాటు పనులు చేస్తున్న విషయం తెలుసుకున్న మహిళా సంఘం సభ్యులు అక్కడికి చేరుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ భవనం మహిళా సంఘాలకు కేటాయించినదని, మేము లేనప్పుడు భవనం గేటు తాళాన్ని ఎలా పగులగొడుతారని ప్రశ్నించారు. అనంతరం ఎమ్మెల్యే తీరుకు నిరసనగా, ఈ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేస్తూ ఐకేపీ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.
అనంతరం ప్రధాన రహదారిపై గంట పాటు రాస్తారోకో చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ దండే విఠల్ అక్కడికి చేరుకొని వారితో మాట్లాడినా వినలేదు. వెంటనే కలెక్టర్ వెంకటేశ్ ధోత్రేతో ఫోన్లో మాట్లాడి సూర్య చంద్ర మండల సమాఖ్య అధ్యక్షురాలు కమలాబాయితో మాట్లాడించారు. ఈ భవనంలో గ్రంథాలయం ఏర్పాటు చేయబోమని, వేరే చోటికి తరలిస్తామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. అనంతరం భవనం ముందున్న అక్రమ టేలాలను తొలగించాలని ఎమ్మెల్సీ దండె విఠల్‌కు వినతి పత్రాన్ని నాయకులు అందజేశారు. మహిళా సంఘాలకు మద్దతుగా జడ్పీ మాజీ చైర్మన్ సిడం గణపతి, నాయకులు నయీం అహ్మద్, గట్టయ్య, పోశం, భాస్కర్, మండల నాయకులు, తదితరులు ఉన్నారు.