చెన్నూర్ : చెన్నూర్ (Chennur) పట్టణంలోని 11వ వార్డు కమటంవాడలో 20 రోజుల నుంచి తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నామని మహిళలు నిరసన తెలిపారు. తాగునీటి సమస్యపై మున్సిపాలిటీ అధికారుల ( Muncipal Officers ) దృష్టికి తీసుకువస్తున్నా పట్టించుకోవడంలేదని మున్సిపల్ కార్యాలయం ఎదుట గురువారం మహిళలు ఖాళీ బిందెలతో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వార్డులో ఉన్న బోరు బావి విద్యుత్ మోటారు చెడిపోవడంతో తాము గత 20 రోజుల నుంచి తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని పేర్కొన్నారు. చెడిపోయిన బోరుబావి విద్యుత్ మోటార్‌కు మరమ్మతులు జరిపించాలని మున్సిపల్ కమిషనర్‌ను కోరితే కోరితే సుద్దాల ప్రశాంత్, కమటం మనోహర్ అనే వ్యక్తులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించారని తెలిపారు.
ప్రతిరోజు రూ.700 ఖర్చుతో ఉదయం , సాయంత్రం రూ.1,400 తో రెండు వాటర్ ట్యాంకర్లను తెప్పించుకొని నీటి అవసరాలను తీర్చుకుంటున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీ అధికారులు స్పందించి వెంటనే బోరుబావికి మరమ్మతులు జరిపించి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు.