చెన్నూర్, జూన్ 24 : ప్రజాపాలన లబ్ధిదారుల ఎంపికలో పలు లోపాలు తలెత్తగా, మరోసారి దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు గ్యారంటీల అమలు లో భాగంగా ప్రజాపాలన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ మేరకు అధికారులు ప్రజ ల వద్దకే వచ్చి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం వీటిని ఆన్లైన్లో పొందుపర్చారు. ఆపై 200 యూనిట్ల ఉచిత కరెంటు, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించేందుకు లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే అధికారుల నిర్లక్ష్యమో.. లేక ఎక్కడ లోపం జరిగిందోగానీ.. అనేక మంది అర్హులకు ఈ రెండు గ్యారంటీలు అమలు కాలేదు.
దీంతో ఎంపికకాని వారు తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ క్రమంలో పార్లమెంట్ ఎన్నికల కోడ్ నేపథ్యంలో దరఖాస్తుల స్వీకరణ నిలిపేశారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ముగియడంతో స్థానిక మున్సిపల్ కార్యాలయంలో తిరిగి లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ప్రజాపాలన రసీదుతో పాటు కరెంటు బిల్లు, గ్యాస్ బుక్కు సంబంధించిన జిరాక్స్ కాపీలతో తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారు. దీంతో జిరాక్స్ సెంటర్లు, కార్యాలయాల చుట్టూ తిరిగాల్సి వస్తుంది. మొదటే స్వీకరించిన దరఖాస్తులను అధికారులు సక్రమంగా ఆన్లైన్లో పొందుపర్చితే ఇప్పుడు మరోసారి దరఖాస్తు చేసుకునే పనే ఉండేది కాదని, ఇప్పుడైనా ఆ రెండు పథకాలకు ఎంపికవుతామో లేదోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.