ఆసిఫాబాద్ టౌన్, సెప్టెంబర్ 24 : కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో రోజురోజుకూ మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయని, మహిళల రక్షణపై రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటీవల జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసీ మహిళపై దాడి చేసిన నిందితుడిపై ఇప్పటికీ తగిన శిక్ష విధించలేదని మండిపడ్డారు. తక్షణమే ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జైనూర్ ఘటనలో ఏర్పాటు చేసిన చర్చలకు స్థానిక ఎమ్మెల్యే, ఆదివాసీ మహిళనైన తనను పిలవలేదని, ఇది జిల్లా ఇన్చార్జి మంత్రి సీతకకు న్యాయం కాదన్నారు. ప్రస్తుతం దవాఖానలో చికిత్స పొందుతున్న బాధిత మహిళకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించాలని, రూ 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆదివాసీ ప్రాంతాల్లో 1/70 యాక్టు, చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. జైనూరులో 144 సెక్షన్ అమలులో ఉన్నందున నిరుపేదలు పనిచేసుకోలేకపోయారని, వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల చొప్పున అందించి ఆదుకోలేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆత్రం సకు, ఆసిఫాబాద్ మాజీ సర్పంచు మర్సుకోల సరస్వతి, తుడుం దెబ్బ అధ్యక్షుడు బుర్శ పోచయ్య, కుమ్రం భీం మనుమడు సోనేరావు పాల్గొన్నారు.
నాణ్యమైన విద్య అందించాలి
జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని ఎమ్మెల్యే కోవలక్ష్మి అన్నారు. మంగళవారం పార్టీ నాయకులతో కలిసి మెడికల్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సతీశ్‌తో మాట్లాడుతూ కళాశాలలో సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆదివాసీ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కారు జిల్లాకు మెడికల్ కళాశాలను మంజూరు చేసిందన్నారు. కాంగ్రెస్ సర్కారు ప్రొఫెసర్ల నియామకానికి చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు పోచయ్య, పార్టీ జిల్లా నాయకురాలు సరస్వతి పాల్గొన్నారు.