ఆసిఫాబాద్ అంబేదర్ చౌక్/జైనూర్, మే 12 : జిల్లా కేంద్రంతో పాటు ఆసిఫాబాద్ మండల వ్యాప్తంగా ఆదివారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. జిల్లా కేంద్రంలో పీటీజీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పార్లమెంట్ ఎన్నికల సామగ్రి, ఈవీఎంల పంపిణీ కేంద్రంలో టెంట్లు కూలిపోయాయి. దీంతో అధికారులు పాఠశాల గదుల్లో తల దాచుకున్నారు.
వర్షపు నీరు నిలవడంతో ఎన్నికల అధికారులు ఇబ్బందులు పడ్డారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్ వద్ద ఓ రేకుల టేల లేచిపోయి వచ్చి రోడ్డుపై పడింది. ఆ కాలనీలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పొట్టి శ్రీరాములు చౌక్‌లో ఓ చెట్టు విరిగి రోడ్డుపై పడగా, రాకపోకలకు ఆటంకం కలిగింది. సందీప్‌నగర్‌లోని శాంతినికేతన్ పాఠశాల సమీపంలో ఓ చెట్టు విరిగి విద్యుత్ స్తంభంపై పడింది. గుండి గ్రామ వాగుపై తాతాలికంగా ఏర్పాటు చేసిన వంతెన వర్షపు నీటికి కొట్టుకుపోయింది.
గ్రామస్తుల రాకపోకలు నిలిచిపోయాయి. తుంపల్లి గ్రామానికి చెందిన పొలవేనీ భీరయ్య ఇంటిపై చెట్టు విరిగి పడింది. అదృష్టవశాత్తు భార్యాభర్తలిద్దరూ బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. జైనూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా రెండు గంటలపాటు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. ప్రజలు ఇబ్బందులు పడ్డారు.