బెల్లంపల్లి, నవంబర్ 21 : పట్టణంలోని మహ్మద్ ఖాసీం బస్తీ స్క్రాప్ దుకాణాన్ని శాశ్వతంగా తరలిస్తారా.. లేక ఎప్పటిలాగే జరిమానా విధించి వదిలేస్తారా అని ఆయా బస్తీల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై స్క్రాప్ వేయడం వల్ల మహ్మద్‌ఖాసీం బస్తీ, హన్మాన్ బస్తీతో పాటు ఇతర కాలనీల వాసులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఈ విషయమై అధికారులకు అనేకసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. దరఖాస్తు ఇచ్చినప్పుడుల్లా అధికారులు రావడం.. నామమాత్రపు చర్యలు తీసుకోవడం.. ఆపై మరచిపోవడం పరిపాటిగా మారిందని స్థానికులు చెబుతున్నారు.
ఈ క్రమంలో ఈ నెల 17న ప్రజాదర్బార్‌లో బస్తీవాసులు కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వారి ఆదేశాల మేరకు గురువారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ వచ్చి స్క్రాప్ దుకాణాన్ని పరిశీలించారు. దుకాణం ఎత్తివేయక పోతే రూ.10 లక్షలకు బాండ్ ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించారు.
అనంతరం రెండు స్వెటర్లను సీజ్ చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ వచ్చి రోడ్డుకు ఇరువైపులా ఉన్న చిన్నా చితక వస్తువులను ట్రాక్టర్లో ఎక్కిస్తుండగా బస్తీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోలాగ కంటి తుడుపు చర్యలు కాకుండా.. పూర్తిగా ఇక్కడి నుంచి దుకాణాన్ని ఎత్తివేయాలని పట్టుబట్టారు. దీంతో ఆయన జోక్యం చేసుకొని సిబ్బంది తక్కువ ఉన్నందున వెంటనే తొలగించలేమని, రెండు రోజుల్లో తొలగిస్తామని కమిషనర్ చెప్పారు. అయినా వినకపోవడంతో మరో ఓపెన్ స్క్రాప్ గదికి తాళం వేసి సీజ్ చేశారు. రెండు మూడు రోజుల్లో పూర్తిగా తొలగించకపోతే, స్క్రాప్‌కు వాడే వాహనాల లైసెన్సులను రద్దు చేయిస్తామని ఆర్డీవో యజమానిని హెచ్చరించారు.