చెన్నూర్ రూరల్, మార్చి 4 : సోమన్పల్లిలోగల డీసీఎంఎస్ సెంటర్లోని యూరియా బస్తాలను అక్రమంగా విక్రయించినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ బుధవారం విచారణ చేపట్టారు. ‘డీసీఎంస్ సెంటర్కు జనవరిలో 222 బస్తాల యూరియా అందిం చాం. రైతులకు కనీసం ఒక్క బస్తా కూడా ఇవ్వలేదు. ఎవరికి అందించారని అడిగితే ఎలాంటి స్పందన లేదు. సెంటర్ ఒకరి పేరు మీద ఉంటే.. నిర్వహించేది మరొకరా.? ఒక్క యూరియా బస్తా కూడా రైతులకు అందించనప్పుడు మీకు సెంటర్ ఎందుకు’ అంటూ ఆమె నిర్వాహకులపై మండిపడ్డారు. పైగా యూరియా అడిగిన రైతులకు నిర్లక్ష్యంగా సమాధానం చెబుతారా.. అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు డీఏవోతో మాట్లాడారు. డీసీఎంఎస్ సెంటర్కు అందించిన యూరియా బస్తాలను సెంటర్ నిర్వాహకుడితో పాటు మరో వ్యక్తి కలిసి పంచుకున్నారని తెలిపారు. సెంటర్ నిర్వాహకుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావడంతో ఆయనకు అవసరమున్నప్పుడు యూరియా తెప్పించి, వారికి అనుకూలంగా ఉన్న వారికి ఎలాంటి రసీదులు లేకుండా ఎక్కువ డబ్బులకు అమ్ముకుంటున్నారని రైతులు ఆమెకు వివరించారు. ఏవో యామిని పర్యవేక్షణ లేకపోవడంతో డీసీఎంఎస్లో ఉన్న యూరియా బస్తాలు పక్కదారి పట్టినట్టు రైతులు తెలిపారు. ఏఈవో కూడా గ్రామంలోని రైతులకు అందుబాటులో ఉండడం లేదని చెప్పగా, ఆమె మండిపడ్డారు. యూరియాను పక్కదారి పట్టించిన డీసీఎంఎస్ సెంటర్ నిర్వాకులపై చర్యలు తీసుకోవాలని డీఏవోకు వినతి పత్రాన్ని అందజేశారు. సోమన్పల్లిలో చేపట్టిన విచారణ నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తానని డీఏవో తెలిపారు.
సోమన్పల్లిలోని డీసీఎంస్ సెంటర్ నిర్వాహకుడు.. ఓ రైతుతో మాట్లాడిన సెల్ఫోన్ రికార్డ్ వైరల్ అవుతున్నది. ‘డీసీఎంఎస్ సెంటర్కు 222 యూరియా బస్తాలు తెచ్చుకున్నాం. నాతోటి నిర్వాహకుడు తిరుపతి రెడ్డి 100 యూరియా బస్తాలు, నేను 100 యూరియా బస్తాలు తీసుకున్నాం.’ అంటూ సెంటర్ నిర్వాహకుడు మాట్లాడిన తీరుపై రైతులు మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మూడు రోజులుగా వస్తున్న వార్తా కథనాలపై ఆందోళన చెందిన నిర్వాహకులు మంత్రి పీఏను కలిసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు మంత్రి పీఏ వ్యవసాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి.. ‘వాళ్లు మా వాళ్లు, మా పార్టీకి సంబందించినవాళ్లు.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దు’ అని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న సెంటర్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. తిరిగి వత్తాసు పలకడమేమిటని పలువురు చర్చించుకుంటున్నారు.