Happy Journey | భిన్నమైన మనస్తత్వాలు కలిగిన కొంతమంది మహిళలు ఒకే ట్రిప్‌కు వెళ్తే ఎలాంటి సరదా సంఘటనలు, ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటాయనే విభిన్న కథాంశంతో వస్తున్న తాజా చిత్రం ‘హ్యాపీ జర్నీ’. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ట్రైలర్ తాజాగా విడుదలయ్యి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. టాలీవుడ్ సీనియర్ నటి అన్నపూర్ణ, ఆమని, ప్రముఖ యాంకర్ జాన్సీలతో పాటు వంశీ, పాయల్ రాధాకృష్ణ, సునయన, రవి శివతేజ, జినీష అలిశెట్టి, రూప శ్రీనివాస్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
వివిధ తరాలకు చెందిన ఏడుగురు మహిళలు యూరప్ ట్రిప్ నేపథ్యంలో సాగే ప్రయాణమే ఈ సినిమా ప్రధాన కథాంశం. మొదట్లో భిన్నమైన అభిప్రాయాల కారణంగా వారి మధ్య జరిగే చిన్న చిన్న గొడవలు, సరదా సంభాషణలు, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రయాణాన్ని ఎలా సాగించారనే భావోద్వేగపూరిత అంశాలతో ట్రైలర్‌ను చాలా ఆసక్తికరంగా కట్ చేశారు.
అభీరామ్ నాయుడు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గుట్ట ప్రొడక్షన్స్, కమలాకర్ ఫిలిం కార్పొరేషన్ పతాాలపై గుట్ట బాలాజీ, గుండాల కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర బాణీలు అందిస్తుండగా, మణికంఠ సుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు. మంచి వినోదం, సెంటిమెంట్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ ‘హ్యాపీ జర్నీ’ చిత్రం సెప్టెంబర్ 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.