ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం..
సెర్ప్, మెప్మా సిబ్బందికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనం ఇస్తాం
అసెంబ్లీ వేదికగా సీఎం ప్రకటన.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,500 మందికి లబ్ధి
ముఖ్యమంత్రి చిత్రపటాలకు పాలాభిషేకం
నిర్మల్ టౌన్, మార్చి 15 : “మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా క్షేత్రస్థాయిలో పనిచేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటాం.. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న సెర్ప్, మెప్మా సిబ్బందికి సర్కారు ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తాం” అని శాసనసభా వేదికగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఫలితంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 1,500 మందికిపైగా ప్రయోజనం చేకూరుతుంది. తాజాగా 80,039 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించడం, మంగళవారమే మళ్లీ తీపికబురు అందించడంతో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్యోగుల పక్షపాతి అని మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ నిరూపించుకున్నారు. మూడు రో జుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో 80 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ను జారీ చేస్తామని ప్రకటించగా.. సెర్ప్ ఉద్యోగులకు కూడా మంగళవారం తీపి కబురు ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల్లోనే సెర్ప్ ఉద్యోగులపై వరాల జల్లు కురిపించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ అభివృద్ధిలో భాగస్వాములవుతున్న మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని ప్రకటించారు. 2019లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో క్షేత్రస్థాయిలో పని చేసిన ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా తిరిగి విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించడంతో ఆనందం వ్యక్తమవుతున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలుండగా.. 68 మండలాలున్నాయి. మొత్తం 1507 గ్రామాలుండగా.. పాత గ్రామ పం చాయతీల్లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పనులు నిర్వహించేవారు. ఉమ్మడి జిల్లాలో 890 మంది ఫీల్డ్ అసిస్టెంట్లుండగా.. నిర్మల్, ఆదిలాబాద్, ఖానాపూర్, భైంసా, చెన్నూర్, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, సిర్పూర్ కాగజ్నగ ర్, మందమర్రి, లక్షెట్టిపేట్ తదితర మున్సిపాలిటీల్లో మెప్మాలో 60 మంది పని చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐకేపీ మహిళా సంఘాల కోసం ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్లు తదితర 500 మంది ఉద్యోగులతో కలిసి మొత్తం 1500 మంది ఈ మూడు విభాగాల్లో పని చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా వీరిపై సానుకూలంగా స్పందించడంతో ఏండ్ల కష్టానికి తమకు ప్రతిఫలం దక్కనున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమం త్రి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మరోసారి రుజువు కావడంతో జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మా మొర ఆలకించిన దేవుడు..
2019 వరకు జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేశాం. 2005లో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లుగా చేరిన మేము అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రూ.3,300 వేతనం తీసుకున్నాం. 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వేతనాన్ని రూ.5 వేలకు పెంచింది. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.10,500 చేసింది. ఫీల్డ్ అసిస్టెంట్లకు తమ వేతనాలు పెంచాలని డిమాండ్చేస్తూ పోరాటం చేస్తే తమకు ఎన్నోసార్లు న్యాయం చేస్తామని చెప్పినా మేము సమ్మె చేశాం. దీంతో మమ్మల్ని 2019 మార్చిలో తొలగించారు. అప్పటి నుంచి మాకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఇన్నాళ్లకు నిర్ణయం ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉన్నాం. ఈ వార్త వినగానే మా కుటుంబసభ్యులంతా ఆనందం వ్యక్తం చేశారు.
– సాయేందర్, ఫీల్డ్ అసిసెంట్ల సంఘం అధ్యక్షుడు
సేవలు గుర్తించినందుకు ఆనందంగా ఉంది..
ఐకేపీలో సెర్ప్ ఉద్యోగులుగా 20 ఏండ్ల నుంచి పని చేస్తున్నాం. నిత్యం గ్రామాల్లో మహిళా సంఘాలతో సమావేశాన్ని నిర్వహించి వారికి బ్యాంకు రుణాలు అందించడం, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం వంటివి చేస్తున్నాం. ఐకేపీలో సెర్ప్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్నోసార్లు ముఖ్యమంత్రికి విన్నవించాం. ఇన్నాళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సర్ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది.
– రేఖ, సీసీ, ఐకేపీ నిర్మల్