నిర్మల్, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ) : రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం నిర్మల్‌లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రజా గొంతుకై అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకున్నా, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన తాము ఏ పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఈసారి ఎనిమిది మందిమి గెలిచామని, రాబోయే రోజుల్లో అది 80 మంది గెలిచేందుకు సంకేతమన్నారు. ఆమోదయోగ్యం కాని హామీలిచ్చి గద్దెనెక్కబోతున్న కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వదిలి పెట్టమన్నారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కచ్చితంగా నెరవేర్చాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. ప్రతి క్షణం ప్రజల సంక్షేమం కోసం పాటు పడుతానన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్‌లో బీజేపీకి ఆదరణ..
రాష్ట్రంలో వీచిన ప్రభుత్వ వ్యతిరేక పవనాల్లో ఓట్లన్నీ ఒకవైపు వెళ్తున్నా కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం నాలుగు స్థానాల్లో బీజేపీని గెలిపించి ప్రధాని నరేంద్ర మోడీకి బహుమానంగా ఇస్తున్నామని మహేశ్వర్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అమలుకు నోచుకోని ఆరు గ్యారెంటీ పథకాలను ఆదిలాబాద్ జిల్లావాసులు నమ్మలేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అహర్నిశలు పాటు పడుతానన్నారు. నన్ను నమ్ముకొని పదేండ్లుగా నా వెంట నడిచి, నా కష్ట సుఖాల్లోపాలు పంచుకున్న నా తోటి నాయకులు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు అంజుకుమార్‌రెడ్డి, పార్లమెంటు ఇన్చార్జి అయ్యన్నగారి భూమయ్య, లక్ష్మణచాంద ఎంపీపీ పద్మ రమేశ్, నాయకులు అయిండ్ల భూపాల్‌రెడ్డి, సరికెల గంగన్న తదితరులు పాల్గొన్నారు.