నార్నూర్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు ఓటర్ జాబితా ( Voters List ) లో తమ పేర్లు లేకుండా చేసిన బూత్ లెవల్ అధికారిపై చర్యలు తీసుకోవాలని ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం ఖైరదట్వా ( Khaira Datwa ) గ్రామస్థులు డిమాండ్ చేశారు. బీఎల్వోపై చర్యలు తీసుకోకపోతే సర్పంచ్ (Sarpanch Oath ) ప్రమాణ స్వీకారాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం ఈ మేరకు గ్రామంలోని కుమ్రం భీం విగ్రహం వద్ద గ్రామస్థులు మాడవి నారంజీ రావు పటేల్, సార్ మేడి మాడవి తూకారాం, మాడవి జగన్నాథ్ పటేల్ విలేకరుల సమావేశంలో డిమాండ్ చేశారు. బీఎల్వో విద్వాన్ నిర్లక్ష్యంతో ఓటర్ జాబితాలో 75 మంది ఓటు హక్కును కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మరో 70 మంది ఓటు హక్కు కోసం దరఖాస్తులు చేసుకున్నా నేటికి జాబితాలో చోటు దక్కలేదని వాపోయారు.
ఎంపీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించిన ఐదుగురి పేర్లు సర్పంచ్ ఎన్నికల జాబితాలో లేకపోవడం శోచనీయమన్నారు. ఓటర్ జాబితాలో పేర్లు నమోదు చేసేందుకు కొందరి వద్ద బీఎల్వో రూ. వంద తీసుకొన్నట్లు ఆరోపించారు. అధికారులు స్పందించి బీఎల్వోపై తక్షణమే చర్యలతో పాటు విధుల నుంచి తొలగిస్తేనే నూతనంగా ఎన్నికైన సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయిస్తామని స్పష్టం చేశారు. లేనిపక్షంలో వచ్చే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మాడవి భగ్ వంత్ రావ్, మరప జాకు, తోడసం మోతిరం, పేందూర్ రాము, మాడవి జయవంత్ రావు, యూత్ అధ్యక్షుడు కుమ్ర చతుర్షావ్ తదితరులున్నారు.