తిర్యాణి మండలం ముల్కలమంద, తోయరేట్ గ్రామాల్లో సుమారు 50 కుటుంబాలుండగా, వీరంతా తాగు నీటికి తండ్లాడాల్సి వస్తున్నది. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ పైపులైన్లు సరిగా లేక గుక్కెడు నీటికోసం వేట సాగించాల్సిన దుస్థితి నెలకొన్నది. ముల్కల మంద గ్రామానికి అర కిలోమీటర్ దూరంలోని వ్యవసాయ బావే వీరికి దిక్కు కాగా, నిత్యం అక్కడికి వెళ్లి బావి గోడపై నిలబడి ప్రమాదకర పరిస్థితుల్లో నీరు తోడుకోవాల్సి వస్తున్నది. ఏ మాత్రం పట్టుతప్పినా బావిలో పడిపోయే అవకాశమున్నదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ గ్రామాల్లోనే కాదు గుండాల, మంగి, తొక్కిగూడ, తాటిగూడ, గోపేర, లంబాడీతండా, గోవెన, కర్పుగూడ, కొలాంగూడ, బీంరాల్ల, బందర్గూడ, మొర్రిగూడ, లోహ, తోయరేటి, మంగర్మోడి, గోండర్గాం, బోర్డాం తదితర గ్రామాల్లోనూ గొంతు తడుపుకునేందుకు గిరిజనులు అష్టకష్టాలు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి మిషన్ భగీరథ పైపులైన్‌కు మరమ్మతులు చేయించి తాగు నీరు సరఫరా చేయాలని వారు వేడుకుంటున్నారు.