ఆదిలాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం తాంసి మండలంకలోని కప్పర్ల రైతులు వినూత్న నిరసన చేపట్టారు. వందమందికి పైగా శాంతియుత ప్రదర్శన చేపట్టారు. కప్పర్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరం నడిచి తాంసి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ లక్ష్మితో పాటు మండల వ్యవసాయశాఖ అధికారి రవీందర్‌కు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం తమకు రూ.2 లక్షల రుణమాఫీ చేయలేదని తెలిపారు.
రేషన్‌కార్డుతో సంబంధం లేకుండా పట్టాపాస్ పుస్తకం ఉన్న రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేస్తామని సీఎం చెప్పినా తమ గ్రామంలో చాలా మందికి రుణమాఫీ కాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కప్పర్లలో ఒకటి, రెండు, మూడో విడుతల్లో రుణమాఫీ కాని రైతులు చాలామంది ఉన్నారని రుణమాఫీకి ఎందుకు కాలేదని అడిగితే బ్యాంకు అధికారులు తమ వద్ద ఉన్న వివరాలు ప్రభుత్వానికి పంపించినట్లు చెబుతున్నారని, వ్యవసాయాధికారులను అడిగితే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ విషయంలో ఆదిలాబాద్ జిల్లాలో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలతో శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం చేసి నిరసన తెలిపారు. శుక్రవారం వినూత్నంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. తలమడుగు మండలం రుయ్యాడి, బజార్హత్నూర్ పోలీస్ స్టేషన్లలో 15 మంది రైతులపై కేసులు నమోదయ్యాయి. దీంతో రైతులు తమ బాధను తెలియజేయడానికి పాదయాత్రను ఎంచుకున్నారు. గ్రామానికి చెందిన రైతులు తాంసి మండలం కప్పర్ల తెలంగాణ గ్రామీణ బ్యాంకులో, తాంసి కో ఆపరేటివ్ బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్నారు.
వీరిలో 70 శాతం మందికి మూడు విడుతల్లో రుణమాఫీ కాలేదు. దీంతో 100 మంది రైతులు కలిసి కాలినడకన ఆరు కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అర్హులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని నినాదాలు చేస్తూ తాంసి మండల కేంద్రంలోని తహసీల్ కార్యాలయానికి తరలివచ్చారు. గ్రామంలో మొదటి, రెండు, మూడు విడుతల్లో 200 మంది రైతులకు రుణమాఫీ రాలేదని, బ్యాంకులు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలి తం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం నిబంధనల పేరిట రైతులకు రుణమాఫీని ఎగ్గొట్టే ప్రయత్నాలు మానుకోవాలని సూచించారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.