ఆదిలాబాద్, మే 30(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం అన్నదాతలు అరిగోస పడాల్సి వస్తున్నది. మూడు రోజైన గురువారం కూడా రైతులు ఆర్సీహెచ్ 659 విత్తనాల కోసం భారీగా తరలివచ్చారు. వచ్చిన విత్తనాల స్టాక్ అమ్మేశామని, ప్రస్తుతం ఆ విత్తనాలు లేవంటూ రైతులకు వ్యాపారులు సూచించారు. దీంతో ఆగ్రహించిన అన్నదాతలు పంజాబ్ చౌరస్తాలో రోడ్డు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కాగా.. వానకాలం సమీపిస్తుండడంతో పది రోజుల నుంచి రైతులు విత్తనాలు సేకరిస్తున్నారు. తమకు కావాల్సిన ఆర్సీహెచ్ 659 విత్తనాల కోసం జిల్లా కేంద్రంలోని దుకాణాల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాకు 27 వేల విత్తన ప్యాకెట్లు రాగా.. అధికారులు జిల్లావ్యాప్తంగా విత్తనాలు పంపిణీ చేపట్టారు. మంగళ, బుధవారాల్లో పంపిణీ చేశారు. ఈ విత్తనాల కోసం వందల సంఖ్యలో రైతులు జిల్లా కేంద్రంలోని పలు దుకాణాల ఎదుట బారులుదీరారు. పోలీసుల బందోబస్తు మధ్య విత్తనాలను పంపిణీ చేశారు. అవసరాల మేరకు ఇవ్వకపోగా.. ఒక్కొక్కరికి కేవలం రెండు ప్యాకెట్లను మాత్రమే ఇచ్చారు. అందనివారు గురువారం విత్తన దుకాణాలకు తరలివచ్చారు. తీరా స్టాక్ లేదని వ్యాపారులు సూచించగా నిరాశతో వెనుదిరిగారు. పంజాబ్ చౌక్‌లో రాస్తారోకో చేస్తున్న రైతులకు విత్తనాలు పంపిణీ చేస్తామని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పుల్లయ్య, డీఎస్పీ జీవన్‌రెడ్డి నచ్చచెప్పడంతో ఆందోళన విరమించారు.
అవసరమైన పత్తి విత్తనాలు దొరుకకపోవడంతో వారు మధ్యాహ్నం వరకు దుకాణాల వద్ద పడిగాపులు కాశారు. ఉదయం వచ్చిన రైతులకు విత్తనాలు అయిపోయాయని వ్యాపారులు చెప్పడంతో చేసేదేమీ లేక దుకాణాల వద్ద కూర్చున్నారు. విత్తనాల స్టాక్ వస్తుందేమోనని ఎదురు చూశారు. చాలా మంది రైతులు ఇతర కంపెనీల విత్తనాలను కొనుగోలు చేయడానికి ఇష్టపడకపోగా, కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకున్నారు. వారు కొనుగోలు చేసిన విత్త నాలు మంచివా? అని ఇతర రైతులను అడగడం కనిపించింది. కేవలం రెండు రోజు లు మాత్రమే రెండేసి ప్యాకెట్ల చొప్పున అమ్మారని, తిరిగి స్టాక్ ఎప్పుడు వస్తుందో అని రైతుల్లో ఆందోళన కనిపించింది. కొంద రు రైతులు 45 డిగ్రీల మండుటెండలో మధ్యా హ్నం వరకు దుకాణాల వద్ద కూర్చొని నిరాశతో వెనుదిరిగారు.
పత్తి విత్తనాల పంపిణీలో వ్యాపారుల ఇష్టారా జ్యం కొనసాగుతుందనే విమర్శలు వ్యక్తమవు తున్నాయి. దుకాణదారులు సరిగా పంపిణీ చేయడం లేదంటూ రైతు సంఘాల నాయ కులు ఆరోపిస్తున్నారు. గురువారం పట్టణం లోని నిఖిల్ ఫర్టిలైజర్ నుంచి 179 ప్యాకెట్ల ఆర్సీహెచ్ 659 విత్తనాలను వాహనంలో ఇచ్చోడకు తరలిస్తుండగా రైతులు అడ్డుకు న్నారు. జిల్లా కేంద్రంలో రైతులకు అవసర మైన విత్తనాలను పంపిణీ చేయకుండా ఇతర ప్రాంతాలకు తరలించడంపై పలు అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. సదరు వ్యాపారి నిబంధనలు పాటించలేదంటూ వ్యవసాయ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు యజమాని రాకేశ్‌రెడ్డిపై రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో 420 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. విత్తనాల పంపిణీలో రైతులను ఇబ్బందులకు గురి చేయ వద్దని కలెక్టర్ రాజర్షి షా సూచించినా వ్యాపా రులు పట్టించుకోకుండా డబ్బు సంపాదనే లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు అంటు న్నారు. రైతులకు సరిపడా విత్తనాలను పంపిణీ చేయని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
నాకు 12 ఎకరాల భూమి ఉంది. కనీసం పది ప్యాకెట్లు అవసరం. పంట బాగా వస్తుందనే నమ్మకంతో ఆర్సీహెచ్ 659 పత్తి విత్తనాల కోసం వారం రోజుల నుంచి తిరుగుతున్నా. రెండు రోజులు క్యూలైన్లో నిల్చున్నా దొరకలేదు. గురువారం దొరుకుతాయనే ఆశతో ఉదయం ఏడు గంటలకే ఆటోలో వచ్చిన. పంజాబ్ చౌక్ల ఐదారు దుకాణాల్లో అడిగితే అయిపోయాయని చెప్పారు. ఈ విత్తనాలు ఎక్కడ అమ్ముతలేరని తెలిసింది. పగటిదాకా ఏమైనా విత్తనాలు దొరుకుతాయని చూసిన లాభం లేదు. వేరే కంపెనీ విత్తనాలు కొనాలంటే పంట సరిగ్గా వస్తుందో లేదో అనే భయమవుతున్నది. విత్తనాల విషయంలో ఏమి చేయాలో తెలియక పరేషాన్ అవుతున్నా. అధికారులను అడిగితే ఒకటో తారీఖున వస్తాయని అంటున్నరు.
– గణేశ్, రైతు, కుచులాపూర్, తలమడుగు మండలం