ఆదిలాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాలతోపాటు మహారాష్ట్ర నుంచి వివిధ రహదారుల మీదుగా మూగజీవాల రవాణా యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొందరు దళారులు నిబంధనలకు విరుద్ధంగా ఆవులు, దూడలు, ఎడ్లను తీసుకెళ్తున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 వరకు మూగజీవాలను కుక్కి హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లోని గోవధశాలలకు తరలిస్తున్నారు. పశువులను అక్రమంగా రవాణా చేస్తున్న వాహనాలను డ్రైవర్లు మితిమీరిన వేగంతో నడపడంతో ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. జిల్లా మీదుగా వాహనాల్లో పశువుల రవాణా అధికంగా ఉంటుంది. ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పశువుల విక్రయాలు జరుగుతాయి.
జైనథ్, బేల, ఇంద్రవెల్లి, ఇచ్చోడ, బోథ్, ఉట్నూర్ ప్రాంతాల్లో పశువుల సంత ఉంటుంది. . నాగ్‌పూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా, చంద్రాపూర్, కాగజ్‌నగర్, ఉట్నూర్ మీదుగా, నాందేడ్ నుంచి బజార్హత్నూర్ మండలంలోని ఘన్పూర్ చెక్‌పోస్టు నుంచి కిన్వట్ నుంచి లక్ష్మీపూర్ చెక్‌పోస్టు మీదుగా పశువుల రవాణా కొనసాగుతోంది. లారీలు, వ్యాన్లు, ట్రక్కులతోపాటు ఇతర నాలుగు చక్రాల వాహనాల్లో పరిమితికి మించి వీటిని తీసుకుపోతున్నారు. ఒక్కో వాహనంలో 20 నుంచి 30 పశువులను కింద పడవేసి తాళ్లతో కట్టి తీసుకుపోతారు. ఆవులు, దూడలు, ఎద్దులను హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాలకు తరలిస్తారు. పక్క రాష్ట్రంలోని యావత్మాల్, కిన్వట్, చంద్రాపూర్, మాడ్వి ప్రాంతాల నుంచి లారీ, వ్యాన్లలో ఎద్దులు, ఆవులు, లేగ దూడలు ఊపిరాడకుండా కట్టివేసి రవాణా చేస్తున్నారు. దళారులు మూగజీవాలను వాహనాల్లో తీసుకుపోవడంలో కనీస నిబంధనలు పాటించడం లేదు. వాహనాల్లో కుక్కి, పడుకోబెట్టి పైన టార్పాలిన్ కవర్లు కప్పి వందల కిలోమీటర్ల దూరం నుంచి ఇష్టానుసారంగా తరిస్తుండడంతో పశువులు ఊపిరాడకం, గాయాల బారిన పడి మరణిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి జాతీయ రహదారి మీదుగా, ఇతర మార్గాల గుండా పోయే వాహనాలు ఎక్కువ స్పీడ్‌తో వెళ్తుండడంతో జిల్లాలోని పలుచోట్ల పశువుల వాహనాలకు ప్రమాదాలు జరిగాయి.
రవాణాకు ప్రత్యేక వాహనాలు ఉండాలి..
నూతన రవాణా చట్టం ప్రకారం మూగజీవాలను తరలించేందుకు ప్రత్యేక రిజిస్ట్రేషన్ కలిగిన వాహనాలు ఉండాలి. ఈ వాహనాల్లో పశువులను తీసుకుపోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. ఒక్కో పశువుకు 3 మీటర్ల దూరం ఉండాలి. కేవలం రాత్రి సమయంలో మాత్రమే పశువులను తీసుకుపోవాలి. పశువులను ఆరు గంటలకు మించి రవాణా చేయరాదు. ఈ సమయం దాటితే పశువులను అనువైన ప్రదేశాల్లో దించి మేత, నీరు అందించాలి. పశువులను రవాణా చేయడంలో సంబంధిత శాఖల అధికారుల ధ్రువీకరణ పత్రాల తప్పనిసరిగా ఉండాలి.
ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు, ఎవరు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియజేయాలి. ఆవులు, దూడల రవాణాలో నిషేధం ఉండగా, వ్యవసాయానికి పనికిరాని ఎద్దులను రైతులకు మాత్రమే విక్రయించాలి. ఇందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి. పశువుల రవాణాలో దళారులు నిబంధనలు పాటించడం లేదు. ఎలాంటి పత్రాలు లేకుండానే యథేచ్ఛగా రవాణ చేస్తున్నారు. ఆదిలాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో పశువుల విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ లోపించింది. మార్కెటింగ్ పశుసంవర్ధక, రవాణ, పంచాయతీ శాఖల అధికారులు పశువుల విక్రయాలను పర్యవేక్షించాల్సి ఉండగా, ఎవరూ పట్టించుకోకపోవడంతో మూగజీవాల రవాణ యథేచ్ఛగా సాగుతున్నది.