కాగజ్‌నగర్, మార్చి 25: కాంగ్రెస్ పార్టీ పాలనలో గ్రామాలు గాడితప్పుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్ మండలంలోని భట్టుపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు. సమస్యలపై గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో గ్రామాలు ఆగమవుతున్నాయన్నారు. సర్పంచులు లేక పోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రాక కనీసం వీధి దీపాలు ఏర్పాటు చేసే పరిస్థితి లేదన్నారు.
పారిశుధ్య నిర్వహణ లేకు మురుగు కాలువలు అధ్వానంగా మారాయన్నారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లకు డీజిల్ పోసే పరిస్థితి లేదని, పారిశుధ్య కార్మికులకు సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంలో ముఖ్యమంత్రికే స్పష్టత లేదన్నారు. మౌలిక వసతులు కల్పించకుండా పన్నులు ఎందుకు వసూలు చేస్తున్నారని ప్రశ్నించారు. తుంగమడుగు గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
గెలిచిన తర్వాత ఆరు నెలల్లో తుంగమడుగుకు రోడ్డు వేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చి గ్రామం వైపు రావడం లేదన్నారు. మాజీ ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ప్రజలకు ఆశ చూపి వదిలేశాడని పేర్కొన్నారు. ఇప్పటికైనా నెల రోజుల్లో రోడ్డు నిర్మించకుంటే వందలాది మందితో నిరసన చేపడుతానని హెచ్చరించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారంపై అసెంబ్లీలో ప్రకటన చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రాజ్‌కుమార్, రాజు, అంజన్న, నరేందర్, తదితరులు ఉన్నారు.