కాసిపేట, ఫిబ్రవరి 4 : మండలంలోని దుబ్బగూడెం గ్రామ శివారులో పెద్దపులి అలజడితో ఒక్కసారిగా గ్రామస్తులు భయాందోళనలకు గురయ్యారు. నెల క్రితం బెజ్జూ రు నుంచి బయలుదేరిన పెద్దపులి(బీ1) అడవుల్లో సంచరిస్తూ వారం క్రితం ఇక్కడికి చేరుకున్నట్లు తెలుస్తున్నది. బుగ్గగూడెం, కన్నాల, పెద్దనపల్లి, దుబ్బగూడెం శివారు ప్రాంతాల్లో మకాం వేసింది. పెద్దపులికి ఎలాంటి హానీ జరగకూడదనే ఉద్దేశంతో ఫారెస్ట్ అధికారులు ఎప్పటికప్పుడు దాని కదలికలను గమనిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం దుబ్బగూడెం గ్రామానికి దగ్గరగా పెద్దపులి రావడంతో ఒక్కసారిగా ఫారెస్ట్, పోలీస్ అధికారులు అప్రమత్తయ్యారు. వెంటనే గ్రామస్తులకు సమాచారం అందించి ఆ వైపు రాకుండా చర్య లు తీసుకున్నారు.
పులి కదలికలను గమనిస్తున్న ఫారెస్ట్ అధికారులకు ఒక్కసారిగా పులి ఎదురు పడింది. వారిని చూసిన పెద్దపులి తన దారిని మార్చుకొని చెట్ల పొదల్లోకి వెళ్లిపోయింది. ఆపై కనిపించకుండా పోయింది. పులి పాదముద్రలను అధికారులు గుర్తించారు. వారం నుంచి ఇక్కడే మకాం వేసింది. మూడు రోజుల క్రితం కన్నాల శివారులో అడవి పందిపై దాడి చేసిన విషయం విదితమే.
ఇది దానికి అనువైన ప్రదేశం కాకపోయినప్పటికీ ప్రజల అలజడికి ఎటూ వెళ్లలేక ఇక్కడే ఉండి పోయినట్లు తెలుస్తున్నది. ప్రస్తుతం అది విశ్రాంతి తీసుకుంటుందని, దానికదే తన దారిలో వెళ్లిపోతుందని, ప్రజలు ఇబ్బందులకు గురి చేయవద్దని అధికారులు సూచిస్తున్నారు. ఎఫ్‌డీవో సర్వేశ్వర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, బెల్లంపల్లి రేంజర్ పూర్ణచందర్, మంచిర్యాల రేంజర్ రత్నాక ర్, డిప్యూటీ రేంజర్లు ప్రవీణ్ నాయక్, గౌరి శంకర్, సం తోశ్, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాస్, బీట్ ఆఫీసర్లు ఉన్నారు.