దహెగాం, మార్చి 23 : దహెగాం మండలంలోని మొట్లగూడ గ్రామస్తులు తాగు నీటికి తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. తప్పనిసరి పరిస్థితుల్లో కిలోమీటర్ దూరంలోనున్న పెద్దవాగుకు కాలినడకన.. ఎడ్లబండ్లపై వెళ్లి చెలిమెల నీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. కేసీఆర్ సర్కారులో మిషన్ భగీరథ ద్వారా ఎంచక్కా నీరు సరఫరా చేయగా, ప్రస్తుత ప్రభుత్వ పట్టింపులేని తనంతో అష్టకష్టాలు పడాల్సి వస్తున్నదని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తున్నది.
పనులన్నీ వదులుకొని..
మొట్లగూడలో సుమారు 130 కుటుంబాలుండగా, 600 వరకు జనాభా ఉంది. ఎండలు ముదరడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగు నీటి తిప్పలు మొదలయ్యాయి. ఇక్కడ సుమారు 8 చేతిపంపులు ఉండగా, వాటిలో సరిగా నీరు రావడం లేదు. మిషన్ భగీరథ పథకం ఉన్నప్పటికీ పైపులైన్‌కు మరమ్మతులు చేయకపోవడంతో కాలనీలకు నీరు సరఫరా కావడం లేదు. ట్యాంక్ సమీపంలోని కొన్ని కాలనీలకు మాత్రమే నీరందుతున్నది.
ప్రధానంగా బొగడ కాలనీ(ఎస్టీ) వాసులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తన్నది. దిక్కుతోచని పరిస్థితుల్లో సమీపంలోని పెద్దవాగుకు వెళ్లి తాగు నీరు తెచ్చుకుంటున్నారు. కేవలం నీటిని తెచ్చుకునేందుకే రోజంతా పనులు వదులుకోవాల్సి వస్తున్నదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి తాగు నీటి గోస తీర్చాలని వారు కోరుతున్నారు.