ఆదిలాబాద్, సెప్టెంబర్ 27 ( నమస్తే తెలంగాణ) : ‘కూలీ పను లు చేసుకునే గరీబోళ్లం. 30 సంవత్సరాలకుపైగా మా తాతల కాలం నుంచి ఇండ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాం. కూలీ పనులు చేసుకుంటూ పైసా, పైసా కూడబెట్టుకుని ఇండ్లు కట్టుకున్నాం. అధికారులు మా ఇండ్లను కూల్చి మమ్మల్ని రోడ్డుపాలు చేయవద్దు’ అంటూ ఖానాపూర్ చెరువు పరిసర ప్రాంతాల వాసుల అధికారులను వేడుకున్నారు. శుక్రవారం రెవెన్యూ, మున్సిపల్, ఇరిగేషన్ అధికారులు నాలుగు బృందా లుగా ఖానాపూర్ చెరువు ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని గుర్తించి హద్దులను మార్కింగ్ చేశారు.
ఈ విషయం తెలుసుకున్న కాలనీవాసులు అధికారులను అడ్డుకున్నారు. ఎందుకు కొలతలు తీస్తున్నారంటూ ప్రశ్నించారు. ఈ ప్రాంతంలో అందరూ పేదలున్నారని కూలీ పనులు చేయనిది పొట్టగడవని పరిస్థితి ఉందని వారు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా నివాసం ఉంటున్న తమ ఇండ్లను ప్రభుత్వం ఇప్పుడు ఎందుకు మార్కింగ్ చేస్తుందని, గృహాలు కూల్చే ప్రయత్నాలను మానుకోవాలని కోరారు. ఇండ్లు కూల్చివేతపై వస్తున్న సమాచారం మేరకు వారం రోజులుగా తాము ఆందోళన చెందుతున్నామని, తిండి తినకపోవడంతో పాటు నిద్రకూడా రావడం లేదని ఆదేదన వ్యక్తం చేశారు. రెక్కల కష్టంపై బతుకుతున్న తమను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేధించవద్దని కోరారు.
తమ ఇండ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని కాలనీవాసులు తెలిపారు. ఇండ్ల నిర్మాణాలు మున్సిపాలిటీ అధికారులు అనుమతులు ఇచ్చారని, మున్సిపల్ ట్యాక్స్ కూడా కడుతున్నామని తెలిపారు. రేషన్‌కార్డులు, ఆధార్ కార్డులు సైతం ఉన్నాయన్నారు. కాలనీలో రోడ్లు, మురుగుకాల్వలు, ఇతర సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందని పాఠశాల సైతం నిర్మించారని తెలిపారు. ప్రభుత్వం కూల్చివేత ప్రయత్నాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇండ్ల కూల్చివేత ప్రయత్నాలను మానుకోవాలని కోరారు.
నేను ఆటో నడుపుకుంటూ బతుకుతున్న. మా తాతల కాలం నాడు నిర్మించిన ఇంట్లో నివాసం ఉంటున్న. మున్సిపాలిటీ అధికారులు వచ్చి ఏ మీ చెప్పకుండా ఇంటికి నంబర్ వేశారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు మార్కింగ్ చేశారు. ఎందుకు ఇలా చేశారని అడిగితే సమాధానం చెప్పడం లేదు. మా కాలనీలో నివసించే వారందరూ గరిబోళ్లు. పనిచేసుకుంటే గానీ కడుపు నిండని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఇబ్బందులు పెట్టవద్దు. ఇండ్లు కూల్చివేస్తే వారి గతి ఏమీ కావాలి. సర్కారు పేదల ఇండ్ల జోలికి రావద్దు.
– అశ్వక్, ఆటో డ్రైవర్, ఖానాపూర్, ఆదిలాబాద్
20 సంవత్సరాలుగా ఇక్కడ గుడిసెలో నివాసం ఉంటున్నాం. గతేడాది రూ.3 లక్షలు అప్పుచేసి రేకుల షెడ్ నిర్మించుకున్నాం. నాకు దివ్యాంగుడైన కొడుకు ఉన్నాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న. ఇంటి నిర్మాణానికి తీసుకున్న అప్పుకు ప్రతి నెలా వడ్డీ కడుతున్నాను. ఇప్పుడు అధికారులు వచ్చి నంబర్లు వేస్తున్నారు. ఇల్లు కూల్చివేస్తే మా పరిస్థితి రోడ్డున పడుతది. చెరువు నీళ్లు మా ఇంటి పరిసరాల్లోకి కూడా రావు. ఇల్లు పోతుందని భయంతో తిండి కూడా తినడం లేదు. నిద్రకూడా రావడం లేదు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను గోస పుచ్చుకుంటున్నది.
– పిట్ల అశోక్, ఖానాపూర్