కుభీర్ : స్మశాన వాటికకు ( Cemetery ) స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తూ బాకోట్( Bacoat) గ్రామస్థులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని బాకోట్ గ్రామంలో స్మశాన వాటిక లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఎంతో కాలంగా నడుస్తూ వస్తున్న సౌనా గ్రామ సమీపంలోని స్మశాన వాటికలోనే బాకోట్ గ్రామస్థులు అంత్యక్రియలు నిర్వహించేవారు.
సౌనా గ్రామాన్ని గత ప్రభుత్వం గ్రామపంచాయతీ చేసింది. దీంతో సౌనా గ్రామస్థులు బాకోట్ గ్రామంలో మృతి చెందిన వారి శవాలను తమ స్మశాన వాటికలోకి తేవద్దని అడ్డుకుంటున్నారు. వ్యవసాయ భూములు కలిగిన వారు తమ తమ భూముల్లో అంత్యక్రియలు నిర్వహిస్తుండగా భూములు లేని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు ఎవరైనా మృతిచెందితే వారి అంత్యక్రియలు జరిపేందుకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
సమస్య పరిష్కరించాలని బాకోట్ గ్రామస్థులు శనివారం కుభీర్- భైంసా ప్రధాన రహదారిపై రెండు గంటల పాటు ఆందోళన నిర్వహించారు. ఇరువైపునా వాహనాలు నిలిచిపోవడంతో కుభీర్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించారు. ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు సమస్యను తీవ్రంగా పరిగణించి బాకోట్ల స్మశాన వాటికకు స్థలం కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.