కాసిపేట : అటవి అక్రమంగా చెట్లను నరకడం, వన్యప్రాణుల వేటగాళ్లను ( Wild animals ) ఇట్టే పట్టుకునే బెల్జియం సంతతి జాగిలం హంటర్ ( Dog Hunter ) గురించి గ్రామస్థులకు అటవి శాఖాధికారులు అవగాహన కల్పించారు. చెమట వాసనతో దొంగలను, వేటగాళ్లను పట్టేసే జాగిలమే హంటర్ అని డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ప్రవీణ్ నాయక్ ( Range Officer Praveen Nayak ) పేర్కొన్నారు.
సోమవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం ముత్యంపల్లి, ధర్మారావుపేట ఫారెస్ట్ సెక్షన్లోని బుగ్గగూడ, చింతగూడ, వెంకటాపూర్ గ్రామాల్లో అటవీ శాఖ ఆధ్వర్యంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది బెల్జియం సంతతి జాగిలం హంటర్ గురించి, జాగిలం చేసే పనుల గురించి వివరించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ నాయక్ మాట్లాడుతూ ఇటీవల జన్నారం డివిజన్లో ఒకరు అక్రమంగా చెట్టు నరకడం చూసిన సిబ్బంది పట్టుకునే ప్రయత్నంలో అతడు పారిపోయాడని తెలిపారు
. ఈ జాగిలాన్ని చెట్లు నరికిన ప్రదేశానికి తీసుకువెళ్లగా అక్కడ చెమట వాసన పసిగట్టి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ వ్యక్తి ఇంటికి తీసుకువెళ్లి నిందితుడిని పట్టించిందన్నారు. ఎవరూ కూడా చెట్లను నరకడం, వన్య ప్రాణులను వేటాడరాదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ సిబ్బంది అనిల్ కుమార్, సెక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ, బీట్ ఆఫీసర్ శ్రీధర్, గ్రామస్థులు పాల్గొన్నారు.