దేశవ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలానికి శ్రీకారం చుట్టిన కేంద్రం, మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి కోల్‌బ్లాక్‌ను సైతం అమ్మకానికి పెట్టడం ఆందోళన కలిగిస్తున్నది. ఓసీ వద్దని కొన్నేళ్లుగా పోరాటాలు చేస్తుండగా, తాజాగా బీజేపీ ప్రభుత్వ నిర్ణయంతో తమ ఊరు బొందలగడ్డగా మారి బతుకులు ఆగమయ్యేలా ఉన్నాయంటూ గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నెన్నెల, జూన్ 24 : జండావెంకటాపూర్ గ్రామ పంచాయతీలోని శ్రావణపల్లి పూర్తిగా లంబాడా గ్రామం. ఇక్కడ 85 వరకు ఇండ్లు ఉండగా, 120 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఇక్కడున్న వారంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. మామిడి తోటలు, వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. తమ గ్రామంలో ఓసీ అయితే తామెట్లా బతికేదని ప్రశ్నిస్తున్నారు.
జీవనాధారమైన వందలాది ఎకరాల్లోని మామిడి తోటలతో పాటు వివిధ పంటలు కనుమరుగయ్యే అవకాశముందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. 50 ఏళ్లుగా వివిధ రకాల మామిడి తోటలు ఇక్కడ పెంచుతున్నారు. మామిడితో పాటు యూకలిప్టస్, టేకు, కొబ్బరి, ఎర్రచందనం తోటలు సాగవుతున్నాయి. వరి పంటలు పండించేందుకు ఇంటింటికీ బోరు బావులు ఉన్నాయి.
ప్రభుత్వం ఓసీ ఏర్పాటుకు వేలం వేస్తే శ్రావణపల్లి విధ్వంసమవుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రావణపల్లి ఓసీలో సుమారుగా 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్లు సింగరేణి ఎక్స్‌ఫ్లోరేషన్ సంస్థ ద్వారా 1999లోనే గుర్తించారు. ఇక్కడ జీ 10 గ్రేడ్ బొగ్గు ఉన్నట్లు తేలింది. దీని జీవిత కాలము 33 ఏళ్లు. ఓసీ బ్లాక్‌లో అటవీశాఖ ఆధీనంలో ఉన్న భూమి 8.15 స్కేర్ కిలోమీటర్లు, 6.54 స్క్వేర్ కిలోమీటర్ల నాన్‌ఫారెస్ట్ భూమి ఉంది. దాదాపు 1937 హెక్టార్ల భూమి అవసరముంది.
శ్రావణపల్లిలో ఓసీ ఏర్పాటు అవుతుందని అప్పట్లో ఏకంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ కోసం తవ్వే కెనాల్ రూట్‌ను మార్పు చేశారు. 4వ ఫేస్ నుంచి ప్రారంభమయ్యే కెనాల్‌ను మైలారం మీదుగా మందమర్రి మండలం శంకర్పల్లి వరకు తవ్వాల్సి ఉంది. మెట్పల్లి సమీపంలో కొంత మేర కాలువను తవ్వారు. ఈ విషయం తెలుసుకున్న సింగరేణి సంస్థ ప్రభుత్వంతో మాట్లాడి కాలువను ఓసీ బ్లాక్ ఏరియా నుంచి తప్పించి మరో ప్రాంతం నుంచి తీసుకెళ్లేందుకు సర్వే చేసింది. మైలారం నుంచి కొత్తూర్ మీదుగా ఆవుడం నుంచి శంకర్‌పల్లికి వచ్చేలా ప్లాన్ చేశారు.
శ్రావణపల్లి గ్రామంలో సింగరేణి సంస్థ ఎక్స్‌ఫ్లోరేషన్ సంస్థ 1994 నుంచే ఇక్కడ బొగ్గు నిక్షేపాలను గుర్తించడానికి అన్వేషణ చేపట్టింది. శ్రావణపల్లిలో అన్వేషణ విభాగానికి చెందిన డ్రిల్లింగ్ మిషన్‌ను 1995లోనే మొదటిసారి అప్పటి నక్సలైట్లు వ్యతిరేకించి దగ్ధం చేశారు. ఆ తర్వాత నెమ్మదిగా అన్వేషణ చేపట్టారు. మరోసారి కూడా నక్సల్స్ డ్రిల్లింగ్ విభాగానికి చెందిన యంత్రాలను తగులబెట్టారు. ఇక్కడ సింగరేణి సంస్థ ఉపరితల గనులను చేపట్టవద్దన్న వ్యతిరేకత ప్రజల్లోవచ్చింది. పలుమార్లు అధికారులు గ్రామంలోకి సర్వే కోసం వస్తే అందరినీ బంధించారు.
ఎట్టకేలకు సర్వేను పూర్తి చేశారు. ప్రజాప్రతినిధులు, వివిధ కార్మిక సంఘాల వారు ఆందోళనలు చేపట్టారు. ఓసీ వలన జరిగే విధ్వంసాలను రైతులకు వివరించారు. రెండేళ్ల కిందట శ్రావణపల్లి ఓసీని ప్రైవేటీకరణ చేసి వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా ఒక్కరే వేలంలో పాల్గొనడంతో వాయిదా పడింది. అప్పుడు కూడా పలు కార్మిక సంఘల నాయకులు శ్రావణపల్లికి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పుడు మరోసారి శ్రావణపల్లిలో ఓసీ చేపట్టడానికి ముందుకు వస్తుండగా, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
మా గ్రామంలో ఓసీ వస్తే మా బతుకులు ఆగమవుతాయి. ఇన్ని రోజులు వ్యవసాయన్నే నమ్ముకుని జీవించినం. ఇక కూడా తాము ఇక్కడే ఉంటాం. మామిడి తోటలు, వరి పొలాలు విడిచి ఎక్కడికి వెళ్లి పోవాలి. చెట్టుకొకరం పుట్టకొకరం అవుతాం. ఇన్నాళ్లూ అన్నదమ్ముళ్లా కలిసి జీవించినం. ఓసీ వస్తే జీవితాలు బుగ్గిపాలు అవుతాయి.
– భూమయ్య, రైతు, శ్రావణపల్లి
మాకు ఓసీ వద్దే వద్దు. ఓసీ వస్తే మా జీవితాలు నాశనం అవుతాయి. మా పిల్లలు ఎట్లా బతుకుడు. ఇక్కడే పుట్టాం, ఇక్కడే ఉంటాం. ఈ ఓసీతో ఆగమవుతాం. మాకు ఎవుసం తప్ప ఏ పనీ రాదు. మా భూములకు ఎంత పరిహారం ఇచ్చినా లాభం లేదు. ఏండ్ల తరడిగా పెంచిన మామిడి తోటలు మళ్లా ఎన్నేండ్లకు చేతికి రావాలె. ఎవరేం చేసినా మా ఊరును వల్లకాడు కానివ్వం.
– మాలోత్ రాంచందర్, శ్రావణపల్లి