సిర్పూర్(టీ), సెప్టెంబర్ 22 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలంలోని వేంపల్లి గ్రామ పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. పంచాయతీ అధికారులు, సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తారు. ప్రజా ప్రతినిధులకు ప్రజల సహకారం తోడవడంతో పల్లె పురోగమిస్తున్నది. 2023 సంవత్సరానికి వేంపల్లి గ్రామ పంచాయతీకి రాష్ట్రస్థాయి స్వచ్ఛ్ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు వరించింది. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులను సక్రమంగా వినియోగించడంతోపాటు పాలకవర్గం, అధికారులు కష్టపడితే మారుమూల గ్రామాలు కూడా ఆదర్శంగా నిలుస్తాయి అనడానికి ఈ గ్రామమే నిదర్శనం.
గ్రామంలో పారిశుధ్య నిర్వహణ, ఇంటింటికీ ఇంకుడు గుంతలు, కిచెన్ గార్డెన్స్‌తోపాటు కమ్యూనిటీ మ్యాజిక్ ఇంకుడు గుంతల ఏర్పాటు, తడి-పొడి చెత్తతో ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 2 వేల లోపు జనాభా గల కేటగిరీలో వేంపల్లికి రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. స్వచ్ఛత, అభివృద్ధిలో దూసుకెళ్తున్న గ్రామాలకు యేటా ప్రభుత్వం స్వచ్ఛ్ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటిస్తోంది. వేంపల్లి గ్రామంలో 520 ఇండ్లు, 1,894 మంది జనాభా, 1,370 మంది ఓటర్లున్నారు. ప్రభుత్వ పాఠశాలతోపాటు గ్రామంలో ఐదు కిచెన్ గార్డెన్స్, పదకొండు కమ్యూనిటీ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేశారు. మరుగుదొడ్లు, ఇంకుడు గుంతల నిర్మాణాలు దాదాపు 100 శాతం పూర్తయ్యాయి. తడి-పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ఇంటింటికీ రెండు డబ్బాలు అందజేశారు. గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌తో తడి-పొడి చెత్తను సేకరించి, వాటిని సెగ్రిగేషన్ షెడ్డుకు తరలిస్తున్నారు. అక్కడ తడి-పొడి చెత్తను ఎరువుగా తయారు చేస్తూ విక్రయిస్తున్నారు. దీంతో పంచాయతీకి ఆదాయం సమకూరుతున్నది.
గ్రామస్తులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించు కున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనులను సక్రమంగా పూర్తి చేశాం. పారిశుధ్య, మొక్కల పెంపకం, సెగ్రిగేషన్ షెడ్డు, క్రిమిటోరియం, మరుగుదొడ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల నిర్మాణం, తడి-పొడి చెత్తను వేరు చేయడం వంటి విషయాలపై ప్రత్యేక దృష్టి సారించాం. మా గ్రామ పంచాయతీకి స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అవార్డు రావడం సంతోషంగా ఉంది.
– డోలి లక్ష్మి, సర్పంచ్, వేంపల్లి