ఎదులాపురం, నవంబర్ 7: స్వాతంత్య్ర ఉద్యమంలో కోట్లాది మంది భారతీయుల్లో వందేమాతర గేయం స్ఫూర్తి నింపిందని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బంకిం చంద్ర చటర్జి రచించిన వందేమాతరం గేయానికి 150 ఏండ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో సామూహికంగా వందేమాతరం గేయా న్ని ఆలపించారు. ఆదిలాబాద్ అదనపు కలెక్టర్లు శ్యామలా దేవి, రాజేశ్వర్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్ర, ఆర్డీ స్రవంతి, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిర్మల్ చైన్‌గేట్, నవంబర్ 7: భారతదేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్షను రగిలించిన గేయం వందేమాతరం అని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో సామూహికంగా వందేమాతరం గేయాన్ని ఆలపించారు. అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిశోర్‌కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.