తాండూర్, జూలై 19 : తాండూర్ మండల కేంద్రంలోని మగ్దూంషా, మక్కుషా బాబాల దర్గా వద్ద ఈ నెల 20, 21 తేదీలలో ఉర్సు ఉత్సవాలు జరుగనున్నాయి. గత వంద సంవత్సరాల నుంచి అనవాయితీగా వస్తున్న ఉర్సు ఉత్సవాలను మతాలకతీతంగా మండలంలోని అన్ని వర్గాల ప్రజలు కలిసికట్టుగా జరుపుకుంటారు. దీంట్లో భాగంగా మొదటి రోజు ఆదివారం దర్గా కమిటీల ముస్లిం పెద్దల ఇంటి నుంచి సందల్ షరిఫ్ ను ముస్లిం యూత్ ఆధ్వర్యంలో ఊరేగింపుతో దర్గా వద్దకు తీసుకువచ్చి మగ్దూంషా, మక్కుషా మజర్ వద్ద పూలచాదర్ సమర్పిస్తారు. రెండో రోజు సోమవారం కూడా ఈ ఉర్సు ఉత్సవాలు కొనసాగుతాయి. రెండు రోజుల పాటు కొనసాగే ఈ ఉర్సు ఉత్సవాలకు స్థానికులు, జిల్లా వాసులే కాకుండా ఇతర జిల్లాలు, మహారాష్ట్ర నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే రెండు రోజుల పాటు జరిగే సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా రాణి తబస్సుం అండ్ పార్టీ, నుస్రత్ సుల్తాని అండ్ పార్టీ ఖవ్వాలి ముఖాబిలా ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఉర్సు ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా కమిటీ అధ్యక్షుడు సాలిగామ బానయ్య, ఉపాధ్యక్షుడు అతర్ హుస్సేన్, సెక్రటరీ ఎంఏ ఖలీల్, సభ్యులు కోరారు. ఉర్సు ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం అన్ని వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.