సిర్పూర్(యూ)/సిర్పూర్(టీ)/చింతలమానేపల్లి/రెబ్బెన/వేమనపల్లి/భీమారం/తాండూర్/కాసిపేట, సెప్టెంబర్ 16 : యూరియా కోసం రైతాంగం కన్నెర్ర చేసింది. సరిపడా పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ పలుచోట్ల రాస్తారోకోలు.. ధర్నాలు చేపట్టింది. ఎరువుల కోసం నెల రోజులుగా గోస పడుతున్నా ప్రభుత్వం పట్టిం చుకోవడం లేదంటూ నిరసనలతో హోరెత్తించింది.
మంగళవారం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(యు) మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో కర్షకు లు బైఠాయించి కాంగ్రెస్ సర్కారు డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. వేలి ముద్ర మిషిన్ పని చేయడం లేదంటూ యూరియా పంపిణీని నిలిపివేశారంటూ వారు మండిపడ్డారు. ఎస్ఐ రామకృష్ణ అక్కడికి చేరుకొని రైతులకు నచ్చజెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఏఈవోలు జైనూర్ నుంచి మిషిన్ తెప్పించి యూరియా పంపిణీ ప్రారంభించడంతో రైతులు శాంతించారు.
ఇక సిర్పూర్ (టీ)మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేసి నిరసన వ్యక్తం చేశారు. తహసీల్దార్ రహీముద్దీన్, కౌటల సీఐ సంతోష్, ఎస్ఐ సురేశ్ రైతులకు నచ్చజెప్పడంతో రైతులు ఆందోళన విరమించారు. అక్కడి నుంచి పీఏసీఎస్ కార్యాలయానికి చేరుకొని ఆందోళన చేపట్టారు. రేపటి నుంచి యూరియా పంపిణీ చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. చింతలమానేపల్లి మండలం బాలాజీ అనుకోడ రైతు వేదిక వద్ద రైతులు యూరియా కోసం ఎగబడ్డారు. 440 బస్తాలు మాత్రమే పంపిణీ చేయడంతో మండిపడ్డారు.
రైతులు రైతు వేదిక ముందు కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. కౌటాల సీఐ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. కాగజ్‌నగర్ ఏడీఏ మనోహర్, తహసీల్దార్ వెంకటేశ్వర్ స్పందిస్తూ ప్రతి ఒక్కరికీ యూరియా అందిస్తామని చెప్పడంతో వారు శాంతించారు. రెబ్బెన మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద ఉదయం నుంచే రైతులు క్యూ కట్టారు. పట్టా పాస్ పుస్తకం జిరాక్సులను లైన్‌గా పెట్టారు. రెబ్బెన ఎస్ఐ వెంకటకృష్ణ పర్యవేక్షించారు.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి సహకార సంఘం కార్యాలయం ముందు ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు ఆందోళన చేయడంతో ఇరువైపులా వాహనాలు పెద్ద సంఖ్యలో నిలిచిపోయాయి. యూరియా కోసం వ్యవసాయాధికారులను నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. నీల్వాయి ఎస్ఐ కోటేశ్వర్ బందోబస్తు నిర్వహించారు. రెండు రోజుల్లో యూరియా పంపిణీ చేస్తామని ఏవో వీరన్న హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.
బీఆర్ఎస్ నాయకులు పురాణం లక్ష్మీకాంత్, కొండగొర్ల బాపు, కుబిడె వెంకటేశం, బెడ్డల రాజలింగు ఉన్నారు. భీమారం రైతు వేదిక వద్ద ఏవో కొట్టే సుధాకర్‌తో పాటు ఏఈవో అరుణ్ పోలీసు పహారా నడుమ రైతులకు టోకెన్లు పంపిణీ చేశారు. కలెక్టర్ కుమార్ దీపక్ అక్కడికి రాగా, రైతులు నిలదీశారు. ఒకే ఒక్క బస్తా ఇస్తే ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. నాలుగైదు రోజుల్లో యూరియా వస్తుందని, ఆందోళన చెందవద్దని రైతులకు నచ్చజెప్పారు.
ఎస్ఐ శ్వేత సిబ్బందితో కలిసి బందోబస్తు నిర్వహించారు. తాండూరు మండలం కొత్తపల్లిలో ఖాకీల కనుసన్నల్లో యూరియా పంపిణీ చేశారు. కొత్తపల్లి రైతు వేదిక వద్దకు యూరియా లారీలు, ఆటోలు వెళ్లలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో రైల్వే అండర్ బ్రిడ్జి సమీపంలో బస్తాల పంపిణీ కొనసాగింది. 500 బస్తాలు మాత్రమే రావడంతో ఒక్కో రైతుకు ఒకే బస్తా చొప్పున పంపిణీ చేశారు. వృద్ధులు, మహిళలు యూరియా కోసం పడరాని పాట్లు పడ్డారు.
మాదారం-3 ఇంకె్లైన్కు చెందిన వృద్ధురాలు గాంధారి పోశవ్వ.. ఆమె కొడుకు, కోడలు ఉదయం ఏడింటి నుంచే క్యూ కట్టారు. వృద్ధురాలు పోశవ్వ ఆకలితో అలమటిస్తుండగా, ఆమె కుమారుడు క్యూలో నుంచి బయటకు వచ్చి అల్పాహారం తీసుకువచ్చి ఇచ్చాడు. దీంతో ఆ అవ్వ అక్కడే ఆదరాబాదరగా తిని.. తిరిగి క్యూ కట్టింది. తాండూరు, మాదారం ఎస్ఐలు కిరణ్‌కుమార్, సౌజన్య, ఏఎస్ఐలు సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. కాసిపేట మండల కేంద్రంలోని సహకార సంఘం వద్ద తెల్లవారు జామున మూడింటి నుంచే రైతులు క్యూ కట్టారు. 266 బస్తాలు మాత్రమే వచ్చాయి. ఒక్కో రైతుకు ఒకే బస్తా ఇవ్వడంతో అసహనం వ్యక్తం చేశారు. లోడ్ రాగానే అందరికీ అందిస్తామని ఏవో చల్ల ప్రభాకర్ చెప్పడంతో శాంతించారు. ఏఈవో శ్రీధర్, సహకార సంఘం సీఈవో రాజశేఖర్ పాల్గొన్నారు.