కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): సిర్పూర్ పేపర్ మిల్లులో లారీ అసోసియేష న్- యాజమాన్యం మధ్య వివాదం సద్దుమణగడం లేదు. పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలకు అనుగుణంగా ఎస్పీఎం యాజమాన్యం లారీల కిరాయి ధరలను పెంచాలని, తదితర డిమాండ్లను నెరవేర్చాలని లారీ యజమానులు పట్టుబడుతున్నారు. లారీ అసోసియేషన్తో యాజమాన్యం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.
గత శనివారం నుంచి మిల్లులో కాగితం ఉత్పత్తుల లోడింగ్ అన్లోడింగ్ పనులు నిలిచిపోయాయి. పేపర్ మిల్లుకు ప్రతి రోజూ వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో లారీలు ముడి సరుకుతో వస్తుంటా యి. సిర్పూర్ పేపర్ మిల్లులో ప్రతి రోజూ ఉత్పత్తి అ య్యే కాగితాన్ని వివిధ ప్రాంతాలకు చేరవేయాల్సి ఉం టుంది. ప్రతి రోజూ 50 వరకు లారీలు ముడిసరుకుతో వచ్చే లారీలు అన్లోడింగ్ కాకపోవడం, మిల్లు లో ప్రతి రోజూ ఉత్పత్తి అయ్యే దాదాపు 3 టన్నుల కాగితం ఇతర ప్రాంతాలకు రావాణా చేసే ప్రక్రియ నిలిచిపోయింది.
దీంతో యాజమాన్యం ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు సకాలంలో చేర్చకపోవడంతో కంపెనీకి నష్టాన్ని కలిగిస్తున్నది. దీంతో మిల్లులో కాగితం ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. ఇతర ప్రాంతాల నుంచి మిల్లుకు రవాణా అయ్యే ముడి సరుకు లారీలను, ఎగుమతి చేసే లారీలను సైతం అసోసియేషన్ ప్రతినిధులు నిలిపివేశారు. దీంతో మిల్లులో ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. మిల్లు యాజమాన్యం లారీ అసోసియేషన్ ప్రతినిధులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో యాజమాన్యానికి, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో మధ్య ఏర్పడిన వివాదం మళ్లీ మొదటికి వచ్చింది.
ధరల పెరుగుదలపై చర్చలు జరిపి మిల్లు ఉత్పత్తికి ఆటంకం కలుగకుండా చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు. తమ న్యాయమైన డిమాండ్లు అమలు చేసే వరకు సమ్మె విరమించేది లేదని కాగజ్నగర్ లారీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. యాజమాన్యం మాత్రం ధరలు పెంచే ప్రసక్తి లేదని తేల్చి చెబుతున్నది. మంగళవారం లారీ అసోసియేషన్ ప్రతినిధులతో ఎస్పీఎం యాజమాన్యం నిర్వహించిన చర్చలు విఫలమయ్యాయి. ఈ వివాదం ఎప్పుడు కొలిక్కి వస్తుందోనని కార్మికులు ఆందోళన చెందుతున్నారు.