నాడు..గాలిదుమారం లేచినా, చినుకుపడినా చిటుక్కున కరెంటు పోయేది. విద్యుత్ తీగలు తెగిపడేవి. స్తంభాలు నేలకొరిగేవి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయేవి. కరెంటు అంతరాయానికి ఊళ్లకు ఊళ్లూ గాడాంధకారంలో మగ్గేవి. పునరుద్ధరించడానికి రోజులు పట్టేది.
నేడు.. భారీ వర్షాలు కురిసినా తట్టుకుని నిలబడే విద్యుత్ వ్యవస్థ. గాలి దుమారానికి సైతం తెగిపడని లైన్లు.. ధృడంగా ట్రాన్స్ఫార్మర్లు. అంతరాయం లేని మెరుగైన, నాణ్యమైన సరఫరా. ఎక్కడ ఏ చిన్న అంతరాయం కలిగినా నిమిషాల్లో పని పూర్తిచేసే సిబ్బంది.
ఇదంతా రాష్ట్ర సర్కారు కృషి ఫలితం. విద్యుత్తు వ్యవస్థ బలోపేతానికి కోట్లు ఖర్చు చేసింది. ఫలితంగా నాణ్యమైన విద్యుత్ నిరంతరాయంగా సరఫరా అవుతున్నది. నిర్మల్ జిల్లాలో ప్రస్తుతం రోజుకు 0.79 మిలియన్ యూనిట్ల వినియోగం అవుతుండగా.. యేడాదికి 780 మిలియన్ యూనిట్లు అవుతున్నది. 66,460 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. 2.15 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి.
నిర్మల్, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ) : స్వ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నది. ఇచ్చిన హామీ మేరకు వ్యవసాయానికి తొలుత పగలు ఆరు గంటలు, రాత్రిపూట మూడు గంటలపాటు ఉచిత విద్యుత్తు సరఫరా చేసేందుకు నిర్ణయించి అమలు చేస్తున్నది. ఆ తర్వాత రాత్రి వరి పైరుకు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు విద్యుత్ షాక్‌కు గురై మరణించడం వల్ల 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి సాగుకు పగటిపూట తొమ్మిది గంటలపాటు సరఫరా చేస్తున్నది. తదనంతరం 2017 నుంచి 24 గంటల నిరంతర విద్యుత్తును సరఫరా చేస్తున్నది. ఒక్క నిర్మల్ జిల్లాలోనే యేటా రాష్ట్ర ప్ర భుత్వం రూ.468 కోట్లు ఖర్చు చేస్తున్నది. నిర్మల్ జిల్లావ్యాప్తంగా అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లు 3,22,209 ఉండగా.. వీటిలో 66,460 వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. నిరంతర కరెంటు సరఫ రా లేకముందు సాగు విస్తీర్ణం కేవలం 80 వేల ఎకరాలు మాత్రమే ఉండగా, ప్రస్తుతం 2.15 లక్షల ఎ కరాలకు పెరిగిందని అధికారులు పేర్కొంటున్నారు.
ఐదేండ్లుగా నిరంతర సరఫరా..
తెలంగాణ సర్కారు నిరంతర విద్యుత్ సరఫరా కోసం రూ.56 కోట్లు వెచ్చించి 35 సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచింది. అవసరమైన చోట కొత్త లైన్లు వేశారు. నాణ్యమైన కరెంటు కోసం 210 కిలో మీటర్ల మేర 33 కేవీలైన్లు వేయగా, 11 కేవీ లైన్లు 141 కిలో మీటర్లు వేశారు. కాగా.. నిరంతర సరఫరాకు ముందు 250 మిలియన్ యూనిట్ల విద్యు త్ వినియోగం ఉండగా, ప్రస్తుతం ఏడాదికి 780 మిలియన్ యూనిట్ల విద్యుత్తు వినియోగమవుతున్నదని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం రోజు 0.79 మిలియన్ యూనిట్లు ఖర్చవుతుండగా, వేసవిలో ఈ వినియోగం మరో 20 శాతం వరకు పెరుగుతుంది. కాగా.. రెండు చోట్ల సోలార్ పవర్ ప్లాం ట్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. పలు ప్రైవేటు కంపెనీల ఆద్వర్యంలో నిర్మల్ శివారులోని సాంగ్వి వద్ద 150 మెగావాట్లు, భైంసా సమీపంలో 50 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చే స్తున్నారు. ఈ విద్యుత్తును గ్రిడ్‌కు అనుసంధానించగా, అవసరమైతే స్థానిక అవసరాలకు కూడా వా డుకునే వెసులుబాటు ఉంది. కాగా.. ట్రాన్స్ఫార్మ ర్లు చెడిపోతే 48 గంటల్లో కొత్తవి వేస్తున్నామని, అ దనంగా 200 ట్రాన్స్ఫార్మర్లు సిద్ధంగా ఉంచామని ఎన్పీడీసీఎల్ ఎస్ఈ జేఆర్ చౌహాన్ తెలిపారు.
రెండు పంటలకు ఢోకా లేదు..
నిరంతర కరెంటు సరఫరాతో రెండు పంటలకు ఢోకా లేకుండా పోయింది. మా కుటుంబానికి నాలుగెకరాల భూమి ఉంది. బోరుబావి ద్వారా సాగు చేస్తున్న. గతంలో కరెంటు కోతలు ఉన్నప్పుడు వానకాలంలో మూడెకరాలు, యాసంగిలో ఎకరానికి మాత్రమే నీరందేది. బోరుబావిలో పుష్కలంగా నీరున్నప్పటికీ కరెంటు లేక నీటిని వాడుకునే పరిస్థితి ఉండేది కాదు. రాత్రి 3 గంటలు, పగలు 4 గంటలు మాత్రమే కరెంటు ఉండేది. దీంతో ఒక మూల పారితే ఇంకో మూల ఎండుతుండే. సీఎం కేసీఆర్‌కు రైతుల కష్టాలు తెలుసుకొని సంక్షేమానికి అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే అధికారులు కూడా వెంటనే స్పందించి మరమ్మతు చేస్తున్నారు.
– పిండి శ్రీనివాస్, రైతు, సిద్ధాపూర్