ఉట్నూర్ : బీఆర్ఎస్ ఖానాపూర్( BRS Khanapur ) నియోజకవర్గ ఇన్చార్జి బుక్యా జాన్సన్ నాయక్ ఆధ్వర్యంలో శనివారం ఖానాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను( Job Mela ) నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని ఉట్నూరు మండల మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంద్ర జైవంత్ రావు కోరారు. గురువారం ఉట్నూరు మండల కేంద్రంలోని ప్రెస్ భవన్ వద్ద జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం హామీని అమలు చేయడం లేదని ఆరోపించారు. తమ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఆధారంగానే ఉద్యోగాలు కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఖానాపూర్ లో నిర్వహిస్తున్న జాబ్ మేళాలో 60 కంపెనీల ప్రతినిధులు హాజరు అవుతున్నారని వివరించారు.
పదవ తరగతి నుంచి డిగ్రీ, బీటెక్ వరకు చదువుకున్న నిరుద్యోగులు ఈ జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు భరత్ చౌహన్, ధరణి రాజేష్, ముజీబ్ ఖాన్, దూట మహేందర్, సిడాం సోనేరావు, సత్యం, దావుల రమేష్, సాజిద్, సూర్యకాంత్ యాదవ్, కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.