దిలావర్పూర్, మే 21 : వరి పండించే రైతులందరికీ క్వింటాలుకు రూ.500 బోనస్ చెల్లించాల్సిందేనని, లేనియెడల బీఆర్ఎస్ పార్టీ ఆ ధ్వర్యంలో రైతుల తరఫున పోరాటం ఉధృ తం చేస్తామని నిర్మల్ నియోజకవర్గ సమన్వయకర్త రాంకిషన్‌రెడ్డి అన్నారు. మంగళవారం రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మండ ల కేంద్రమైన దిలావర్పూర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పార్టీ నాయకులు రైతులతో కలిసి ముట్టడించారు. అనంతరం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం కుప్పలను పరిశీలించి అక్కడున్న రైతులతో మాట్లాడారు. అనంతరం రాంకిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కారు ప్రతి ధాన్యం గింజను, తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు. అసెంబ్లీ ఎన్నికల్లో క్వింటాలు ధాన్యానికి బోనస్‌గా రూ.500 చెల్లిస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు సన్న రకం వడ్లకు మాత్రమే చెల్లిస్తామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. దొడ్డు రకం వరి సాగు చేసే వారు రైతులు కారా అని వారు ప్రశ్నించారు. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు.
కొనుగోలు కేంద్రాల్లో దళారుల కంటే అధిక దోపిడీ
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో దళారుల కంటే అదిక దోపిడీ చేస్తున్నారని దిలావర్పూర్ బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏలాల చిన్నరెడ్డి అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద నుంచి తేమ శాతం పరిశీలించి కొనుగోలు చేసినప్పుడు, 40 కిలోల బస్తాకు అదనంగా 3 కిలోలు ఎందుకు ఎక్కువగా తీసుకుంటున్నారని ప్రశ్నించారు. ఈ ధాన్యం డబ్బులు ఎవరు తీసుకుంటున్నారో రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక్కొక్క రైతు నుంచి క్వింటాలుకు అదనంగా 6 నుంచి 7 కేజీలు ఎక్కువగా తీసుకుంటున్నారని, ఇది రైతులను దోచుకోవడం కాదా అని ప్రశ్నించారు. రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో- ఆప్షన్ సభ్యులు సుభాష్‌రావు, గుండంపల్లి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సంగెం గంగారెడ్డి, మాజీ సర్పంచ్‌లు సాయరెడ్డి, రాజు, విఠల్, నిర్మల్ పట్టణ పార్టీ అధ్యక్షుడు మారుకొండ రాము, మండల కో- ఆప్షన్ సభ్యులు అన్వర్‌ఖాన్, వెంకగారి నర్సయ్య, బొల్ల ఆనందం, నర్సపూర్(జీ) మండల పార్టీ అధ్యక్షుడు సుదన్, నిర్మల్ మార్కెట్ కమిటీ సభ్యులు రాథోడ్ అశోక్, షేక్ అలీం, షేఖ్ రఫీ, శ్రీనివాస్, గోవిందుల మధు, రాజు పాల్గొన్నారు.