జైనూర్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ( Power Official Negligence ) కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనురు ( Jainoor ) మండల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ కనుక యాదవ్ ( Kanuka Yadav ) ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. వాతావరణంలో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నా, చిన్నపాటి గాలి వీచినా విద్యుత్ శాఖ అధికారులు వెంటనే కరెంటు నిలిపివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
గంటల తరబడి విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో చిన్న పిల్లలు, వృద్ధులు నరకం అనుభవిస్తున్నారని తెలిపారు. వర్క్ ఫ్రం హోమ్ చేసే ఉద్యోగులు, చిన్న వ్యాపారస్తులు, డిజిటల్ సేవలపై ఆధారపడిన వారు కరెంట్ లేక తమ పనులను సకాలంలో పూర్తి చేయలేకపోతున్నారని పేర్కొన్నారు.
అత్యవసర సేవల నంబర్లకు ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని అన్నారు. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినా కూడా శాఖ అధికారులు విద్యుత్ లైన్లను ఎందుకు ఆధునీకరించడం లేదని ప్రశ్నించారు. విద్యుత్ సరఫరాలో నాణ్యతను పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు ఓటేస్తే రాష్ట్రం చీకటి రాజ్యం వస్తుందని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. అదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి నిజం చేస్తున్నారని విమర్శించారు.