మంచిర్యాల అర్బన్, ఆగస్టు 12 : మంచిర్యాల మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పని చేస్తున్న మడుగుల నవీన్ (చింటూ) సోమవారం తెల్లవారు జామున నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం జిల్లాలో కలకలం రేపింది. బాధితుడు నవీన్ కథనం ప్రకారం.. మంచిర్యాల పట్టణంలోని 5వ వార్డు కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు.
అనారోగ్యంతో ఉన్న కొందరి పర్మినెంట్ కార్మికుల స్థానంలో కొత్తగా పేర్లు నమోదు చేసుకోడానికి 22 మందికి అవకాశం వచ్చింది. దీంతో హరికృష్ణ కొద్ది రోజుల క్రితం కాంట్రాక్టు కార్మికులందరినీ సున్నంబట్టివాడలోని ఓ జిమ్ సెంటర్‌కు పిలిపించి పర్మినెంట్ చేయిస్తామని హామీ ఇచ్చారు. మీ పేర్లు రిజిస్టర్లో ఎక్కాలంటే ఒక్కొక్కరూ రూ.55 వేలు ఇవ్వాలని చెప్పారు. మీకు ఏదైనా సమాచారం కావాలంటే ఇక నుంచి నవీన్ (చింటూ)ను కలవండి అన్నాడు.
నవీన్ అప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. 22 మందిలో 8 మంది ముందుకు వచ్చి 2023 ఆగస్టులో రూ.4.40 లక్షలు నవీన్‌కు అప్పగించారు. ఆ డబ్బులను తీసుకెళ్లి కౌన్సిలర్‌కు ఇచ్చినట్లు బాధితుడు చెబుతున్నాడు. కొన్ని రోజులు గడిచాక డబ్బులు ఇచ్చిన కాంట్రాక్ట్ కార్మికులు ఇంకా తమ పేర్లు ఎక్కించడం లేదని, ఏమైందని నవీన్‌ను నిలదీశారు. దీనిపై కౌన్సిలర్‌ను వెళ్లి కలవగా ఎలక్షన్ కోడ్ అమలులో ఉందని, ఇప్పుడు పనులు కావంటూ వాయిదా వేసుకుంటూ వచ్చారు.
ఎన్నికలయ్యాక పని కాకపోవడంతో ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని సదరు కార్మికులు నవీన్‌ను నిలదీశారు. విషయం పెద్దది కావడంతో 2024 జనవరిలో పట్టణంలోని చంద్రదత్ హాస్పిటల్ పక్కన ఉన్న క్లబ్లో యూనియన్ కాంట్రాక్ట్ కార్మికులందరూ హరికృష్ణను పిలిపించి పంచాయతీ చేశారు. ఇక్కడ డబ్బులు తిరిగి కట్టేందుకు సదరు కౌన్సిలర్ అంగీకరించినట్లు చెబుతున్నారు.
ఈ పంచాయతీ జరిగిన నాలుగు రోజులకు యూనియన్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న నవీన్ (చింటూ) పదవికి రాజీనామా చేశారు. తమకు ఇస్తానన్న డబ్బుల కోసం సదరు కార్మికులు 10 రోజులు గడిచిన తర్వాత హరికృష్ణకు ఫోన్ చేసి అడుగగా, నవీన్ యూనియన్‌లో లేడు.. డబ్బులు ఇవ్వడం కుదరదంటూ చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు. ఇదే విషయాన్ని రెండు నెలల క్రితం బాధితులు నవీన్‌తో కలిసి వెళ్లి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుకు చెప్పారు.
అనంతరం ఎమ్మెల్యే దొరకక పోవడం, ఎక్కడికెళ్లినా న్యాయం జరగకపోవడంతో బాధితులు ఈ నెల 5న మంచిర్యాల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి కౌన్సిలర్‌పై ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న కౌన్సిలర్ సైతం అదే రోజు కార్మికులపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ముందు నుంచి జరిగినదంతా చెబుతూనే.. సూసైడ్ చేసుకోబోతున్నట్లు నవీన్ ఆదివారం వీడియో విడుదల చేశాడు.
దీంతో తననే బ్లాక్ మెయిల్ చేస్తూ బెదిరిస్తున్నారంటూ కౌన్సిలర్ ఆదివారం మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడి తెలిపాడు. కౌన్సిలర్ తీరుతో మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు నవీన్ తెలిపాడు. ఈ విషయంపై మంచిర్యాల పట్టణ సీఐ బన్సీలాల్‌ను ఫోన్లో వివరణ కోరేందుకు యత్నించగా అందుబాటులోకి రాలేదు. ఇదే విషయమై ఆరోపణలు ఎదుర్కొంటున్న కౌన్సిలర్ సుదమల్ల హరికృష్ణను వివరణ కోరగా..
‘కార్మికుల నుంచి నవీనే డబ్బులు వసూలు చేశాడు. అతను తీసుకున్న డబ్బులకు.. నాకు ఎలాంటి సంబంధం లేదు. తొలిసారి జరిగిన సమావేశంలో ఎవ్వరికీ డబ్బులు ఇవ్వొద్దని కార్మికులకు చెప్పాను. దాన్ని వక్రీకరించి నేనే డబ్బులు తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు బాధితుల నుంచి ఒత్తిడి రావడంతో నాపై కావాలనే ఆరోపణలు చేస్తున్నారు’ అంటూ కౌన్సిలర్ చెప్పుకొచ్చాడు. కార్మికులకు న్యాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. కాగా, నవీన్ ప్రస్తుతం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నాడు.