ఖానాపూర్ టౌన్/జన్నారం, జూలై 13 : మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్‌పెల్లి గ్రామానికి చెందిన చొప్పదండి లక్ష్మణ్, వరుసకు బామ్మర్ది అయిన మురిమడుగు గ్రామానికి చెందిన పడిగెల జశ్వంత్‌లు కలిసి పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లారు. ఇటీవలే లక్ష్మణ్‌కు పెండ్లి సంబంధం కాయం కావడంతో ఈనెల 18వ తేదీన పెండ్లి పెట్టుకున్నారు. పెండ్లి ఇంకా నాలుగు రోజులే ఉండడంతో ఖానాపూర్, నిర్మల్ పట్టణాల్లో ఉన్న తమ బంధువులకు పత్రికలు ఇవ్వడానికి ఆదివారం ఉదయం పల్సర్ బైక్‌పై బయలుదేరారు.
నిర్మల్ వైపు వెళ్తుండగా ఉదయం 11 గంటలకు ఖానాపూర్లోని కుమ్రం భీం చౌరస్తాలో అతివేగం వల్ల బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్లలోకి దూసుకెళ్లింది. తలకు బలమైన గాయాలు కావడంతో చొప్పదండి లక్ష్మణ్(25), పడిగెల జశ్వంత్(19)లు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
కాగా.. చొప్పదండి గంగన్న-కమల దంపతుల చిన్న కుమారుడు లక్ష్మణ్ మృతిచెందడంతో రోదనలు మిన్నంటాయి. ఇంకా నాలుగు రోజుల్లోనే పెండ్లి ఉండడంతో కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నాయి. లక్ష్మణ్‌కు ఒక అన్న, ఒక చెల్లి ఉన్నారు. జశ్వంత్ మృతదేహం వద్ద అతని తల్లిదండ్రులు భాగ్యలక్ష్మి-రాజన్న, అన్న వంశీ, బంధువులు రోదించిన తీరు అందరిని కలచివేసింది.